తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడిపోతున్నారు. భవిష్యత్తులో పనికొస్తారనుకున్న యువనేతలు కూడా గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇటీవలే హస్తాన్ని వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి తనయుడు మర్రి పురూరవ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడారు. రాజకీయ వారసత్వంతో కాకుండా సొంత సామర్థ్యంతో ముందుకు వెళ్తానంటూ రాజీనామా చేశారు.
‘‘ఇటీవల కాలంలో కాంగ్రెస్ జరిగిన పరిణామాలు నాకు ఆవేదన కలిగించాయి. రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాలతో నష్టం వాటిల్లుతోంది. పార్టీ బలపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజీనామా లేఖలో తెలిపారు. పురూరవ రెడ్డి తండ్రి బాటలోనే కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. పురూరవ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.