దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు కంపెనీ అయిన మారుతీ సుజుకీ తన 17,362కార్లను రీకాల్ చేసింది. రీకాల్ చేసిన వాహనాల జాబితాలో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా వంటి పెద్ద మోడళ్లు ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా ఈ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కార్ల తయారీ 8 డిసెంబర్ 2022,12 జనవరి 2023 మధ్య జరిగినట్లు కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ కారులో ఎలాంటి లోపం ఉన్నా కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుందని తెలిపింది. దీని కోసం, వినియోగదారులు ఎలాంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కంపెనీ సలహా:
ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్స్‌ని తనిఖీ చేయడానికి, భర్తీ చేయడానికి ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్లలో లోపం కారణంగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు పనిచేయకపోవడం వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొవల్సి వస్తుందని కంపెనీ తెలిపింది. కారులో ప్రమాదకరమైన భాగాలను మార్చే వరకు మీరు వాహనాన్ని నడపవద్దని…లేదా ఉపయోగించకూడదని యజమానులకు కంపెనీ సూచించింది. కంపెనీ నుండి రీకాల్ చేసిన కార్లున్న కస్టమర్లకు త్వరలో అధీకృత వర్క్‌షాప్ నుండి మెసేజ్ పంపించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది కంపెనీ.
భారీగా పెరిగిన మారుతీ వాహనాలు ధరలు:
కంపెనీ తన అన్ని వాహనాల ధరలను 1.1 శాతం వరకు పెంచేసింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల ప్రభావంతో కంపెనీ ధరను పెంచినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోడల్ శ్రేణిని అప్డేట్ చేయడానికి కూడా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.