ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ కీలక విషయాన్ని వెల్లడించింది. లోపం కారణంగా 9,125 కార్లను రీకాల్ చేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. ముందు వరుస సీటు బెల్టులో ఎత్తును అడ్జెస్ట్ చేసే చోట లోపం ఉన్నట్టు అనుమానం ఉందని, అలాగే వదిలేస్తే సీటుబెల్టు విడిపోయే అవకాశం ఉందని వివరించింది. సియాజ్, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ ఎల్ 6, గ్రాండ్ విటారా మోడళ్లు రీకాల్ చేసే లిస్టులో ఉన్నాయంది. నవంబర్ 2 నుంచి 28 మధ్య తయారైన వాహనాలను మాత్రమే వెనక్కి రప్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ వాహనాలను పరిశీలించి లోపం ఉన్నట్టు తేలితే ఆయా పార్టులను ఉచితంగానే అమరుస్తామని చెప్పింది. ఆయా తేదీల్లో వాహనాలను కొన్న యజమానులకు ఈ సమాచారం వ్యక్తిగతంగా పంపిస్తున్నట్టు వెల్లడించింది.