అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి

June 6, 2022

అగ్రరాజ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. అమెరికాలోని మొత్తం మూడు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు. ఫిలడెల్ఫియాలోని సౌత్‌ స్ట్రీట్‌లో వారాంతాన్ని ఆస్వాదిస్తున్న జనంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసు అధికారి డీఎఫ్‌ పేస్ స్థానిక మీడియాకు వెల్లడించారు. టెనెస్సేలోని చట్టనూగలో కాల్పులకు ముగ్గురు మరణించగా, 14 మందికి గాయాలయ్యాయి. మరో ఘటనలో మిచిగాన్ రాష్ట్రం సగినావ్ లో తుపాకీ కాల్పులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం వరకు నిందితులను గుర్తించలేకపోయారు. టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డేలో ఇటీవలే ఓ బాలుడు పాఠశాలలో జరిపిన కాల్పులకు 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. అంతకుముందుకు న్యూయార్క్ లోని బఫెలో లో గ్రోసరీ స్టోర్ లో కాల్పులకు 10 మంది మరణించిన ఘటనలు ఇంకా మర్చిపోక ముందే తాజా దారుణాలు నమోదు కావడం అక్కడి జనాలను ఆందోళనకు గురిచేస్తోంది.