ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని జామియానగర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 80 ఇ-రిక్షాలు, 10 కార్లు, రెండు స్కూటర్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. మంటల్లో ఆహుతైన ఇ-రిక్షాల్లో 30 కొత్తవి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జామియా నగర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఈ రోజు (బుధవారం) వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది.
సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 11 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.