దేశంలో భారీగా పెరిగిన దొంగ నోట్లు.. ఆర్బీఐ నివేదిక - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో భారీగా పెరిగిన దొంగ నోట్లు.. ఆర్బీఐ నివేదిక

May 30, 2022

నకిలీ నోట్లు ఏ దేశ ఆర్ధిక వ్యవస్థకైనా గుదిబండ లాంటిది. దీని గురించే 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నోట్లను రద్దు చేసింది. దాంతో మంచి ఫలితాలు వచ్చినా కొన్నాళ్లకు షరా మామూలైపోయింది. కొత్త నోట్లు తెచ్చినా కేటుగాళ్లు వాటికి కూడా డూప్లికేట్లు తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2021 – 2022 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల నోట్లకు దొంగ నోట్లు భారీగా పెరిగిపోయాయని పేర్కొంది. రూ. 500 నోట్లు 101.9 శాతం, రూ. 2000 నోటుకు సంబంధించి 54.16 శాతం మేర దొంగ నోట్టు పెరిగాయని తెలిపింది. ఇదిలా ఉండగా, నగదు చెలామణి ఏటేటా భారీగా పెరిగిపోతోంది. గత ఆర్ధిక సంవత్సరం రూ. 3867.90 కోట్ల రూ. 500 నోట్లు చెలామణిలో ఉండగా 2021 – 2022 కి వచ్చేసరికి రూ. 4554.68 కోట్లుగా ఉంది. కాగా, నోట్లలో రూ. 500 నోటే ఎక్కువగా వాడుకలో ఉంది. దాని తర్వాత రూ. 10 నోటు ఉంది. ఇక రూ. 2000 నోట్ల సంఖ్య భారీగా తగ్గింది. 274 కోట్ల నుంచి 214 కోట్లకు పడిపోయింది. ఆర్బీఐ నివేదికపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇదంతా నోట్ల రద్దు వల్లే జరిగిందంటూ నిలదీస్తున్నాయి.