దేశంలో తొలిసారి భారీగా లిథియం నిల్వలను కనుగొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల నిల్వలను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో ఈ లిథియం నిల్వలు ఉన్నాయని గనుల శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. లిథియం స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీల తయారీలో కీలక ప్రాధాన్యత ఉంది. భారీ ఎత్తున నిల్వలు ఉండడంతో రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం భారత్.. లిథియంని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనిపై గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు కనుగొన్న నిల్వలు చాలా కీలకం. అంతకంటే వాటిని ప్రాసెస్ చేయడం కూడా ముఖ్యమే’ అని పేర్కొన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 51 ఖనిజ నిక్షేపాలను గనుల శాఖ గుర్తించింది. అందులో 5 బంగారు గనులు ఉన్నాయి. 17 చోట్ల 7 వేల 897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ నిక్షేపాలు ఉన్నాయి. 2018 -19 మధ్య చేసిన సర్వేల ఆధారంగా ఈ నిక్షేపాలను గుర్తించగలిగారు. అటు మిగిలిన గనుల్లో పొటాష్, మాలిబ్డినం వంటి ఇతర లోహాలను కనుగొన్నారు. ఈ గనులు కశ్మీర్, ఏపీ, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.