పాకిస్తాన్‌లో భారీస్థాయిలో అత్యాచారాలు.. ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో భారీస్థాయిలో అత్యాచారాలు.. ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

June 21, 2022

పాకిస్థాన్‌ దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్నీ) ప్రకటించింది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ దారుణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ అత్యాచార కేసులను కట్టడి చేసేందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చిందని అక్కడి హోం మంత్రి అత్తా తరార్ తెలిపారు.

హోం మంత్రి అత్తా తరార్ మాట్లాడుతూ..”మహిళలపై, చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం, సమాజానికి, ప్రభుత్వానికి తీవ్రమైన ఆందోళన కల్గిస్తుంది. నిత్యం నాలుగు నుంచి ఐదు అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, బలవంతపు చర్యలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అత్యాచారాలు, శాంతిభద్రతల పరిస్థితులను రాష్ట్ర కేబినెట్ కమిటీ సమీక్షిస్తుంది. ఈ ఘటనలను నియంత్రించేందుకు టీచర్లు, అటార్నీలు, మహిళా హక్కుల సంస్థలతో మాట్లాడుతున్నాం. భద్రత విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు తెలియజెప్పాలి. యువతులను ఇంట్లో ఒంటరిగా విడిచి వెళ్లొద్దు” అని ఆయన అన్నారు.

మరోపక్క ఈ అత్యాచారాలపై పాకిస్తాన్‌లో ఉన్న స్కూళ్లలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అధికారులను నియమించింది. మహిళలకు, యువతుల పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. యువతుల పట్ల ఆసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికి పంజాబ్‌లో అత్యాచారాలు ఆగటం లేదు. దాంతో యువతులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు, బాలికలకు, యువతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.