పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆయుధాలతో స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై కాల్పులకు తెగబడి బీభత్సం చేశారు. పాక్ మీడియా కథనం ప్రకారం దాదాపు 4గంటల పాటు సాగిన ఈ పోరులో పాక్ భద్రతా దళాలు విజయం సాధించినట్లు తెలిపింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోగా, ఓ రేంజర్ , ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయని దిఎక్స్ ప్రెస్ ట్రబ్యున్ కథనంలో వెల్లడించింది.
కానీ ఈ ఉగ్రదాడిలో 12మంది పోలీసులు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆటోమెటిక్ గన్స్ తో షరియా ఫైజల్ ప్రాంతంలో పోలీస్ చీఫ్ ఆఫీసులోకి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.
పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు:
ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి పెద్ద సంఖ్యలో కరాచీ పోలీసులు, పాకిస్తాన్ రేంజర్లు సంఘటనా స్థలంలో మోహరించాయి. కరాచీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్నారని సమాచారం. AIG కార్యాలయం సమీపంలోని ప్రాంతాలను పాకిస్థాన్ రేంజర్లు, పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులపై పోలీసు బలగాలు, పాకిస్థాన్ రేంజర్ల ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. జియో టీవీ ప్రకారం, మొత్తం ఉగ్రవాదుల సంఖ్యపై ఎటువంటి సమాచారం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన తర్వాత రెస్క్యూ అధికారి గాయపడ్డారు.