రేవంత్‌ రెడ్డిపై మస్తు కోపం వచ్చింది: జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్‌ రెడ్డిపై మస్తు కోపం వచ్చింది: జగ్గారెడ్డి

March 22, 2022

revanth

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు. ”కాంగ్రెస్‌లోని కొందరు సోషల్ మీడియాలో నా పరువు తీస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తా. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావం. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదు. రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ. మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను ఆహ్వానించలేదు.

ఆ పర్యటనకు నన్ను పిలవకపోవడంతో నాకు కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా? ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరింది. కాంగ్రెస్ పై అభిమానంతో ఎప్పటినుంచో ఈ పార్టీలో కొనసాగుతున్నా. నాకు, సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవు” అని జగ్గారెడ్డి అన్నారు.

మరోపక్క ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశాలు, రేవంత్ రెడ్డితో విభేదాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ మీడియా ముందు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.