మసూద.. మూవీ రివ్యూ కా..స్త లాగినా బానే భయపెట్టిందిగా - MicTv.in - Telugu News
mictv telugu

మసూద.. మూవీ రివ్యూ కా..స్త లాగినా బానే భయపెట్టిందిగా

November 18, 2022

ఈ మధ్య కాలంలో హారర్ ప్లస్ కామెడీ నేపథ్యంతో సినిమాలు రావడం కామనైపోయింది. అలా దయ్యాలు, ఆత్మల కాన్సెప్టుని వాడుకుని, కామెడీ సీన్లు రాసుకుని కథను లాగించిన కొన్ని చిత్రాలు హిట్టయితే, మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో ఓ సీరియస్ హారర్ మూవీ రాక చాలా రోజులవుతుందనుకుంటున్న సమయంలో వచ్చిందీ ‘మసూద’. ట్రైలరుతోనే ఆడియెన్సులో మంచి ఇంట్రస్ట్ క్రియేట్ చేసి ఈ శుక్రవారం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ప్రేక్షకులు ఊహించినట్టుగా హర్రర్ ఎలిమెంట్సుని ఎక్స్‌పీరియన్స్ చేశారా? మసూద ఎంతలా ఆకట్టుకోగలిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే..
నీలం(సంగీత) తన భర్త అబ్దుల్ (సత్యప్రకాష్) నుంచి విడిపోయి కూతురు నజియా(భాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్టుమెంటులో నివసిస్తుంటుంది. అదే అపార్టుమెంట్లో పక్క ఫ్లాట్లో ఉండే గోపీ(తిరువీర్) వాళ్లకు సాయం చేస్తూ చేదోడువాదోడుగా ఉంటాడు. స్వతహాగా భయస్తుడు, మొహమాటస్తుడు అయిన గోపీ తన సహోద్యోగయిన మినీ(కావ్య) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తన ప్రేమ కూడా దాదాపు ఆ అమ్మాయి ఓకే చేసి అన్నీ మామూలుగా జరిపోతున్నాయనుకున్న సమయంలో అనుకోకుండా నజియా వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. దాంతో నీలం, గోపీ ముందు హాస్పిటల్లో చూయించినా ఫలితం లేకపోవడంతో ఆ తర్వాత దయ్యం పట్టిందన్న అనుమానంతో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్)ని ఆశ్రయిస్తారు. అక్కడి నుంచి మసూద ఎవరు? నజియాని ఎందుకు ఆవహించింది? మసూద గతమేంటి? నజియాని ఆవహించిన మసూద ఆఖరికి ఎలా వదిలి వెళ్లింది అనేదే సినిమా కథ.

నటీనటులెలా చేశారంటే..
కథలో ప్రధాన పాత్రయిన గోపీగా తిరువీర్ చక్కగా నటించాడు. ఆత్మల గురించిన సీన్లలో భయస్తుడిగా, హీరోయిన్‌తో తన ప్రేమ విషయం చెప్పడానికి ఇబ్బందిపడే సీన్లలో మొహమాటస్తుడిగా ఒదిగిపోయాడు. నటుడిగా తన కెరీరుకి ఈ చిత్రం ఎంతో హెల్పవుతుందనే చెప్పాలి. ఇక టీజేజీ కూతురిని ఆత్మలనుండి కాపాడుకోడానికి తాపత్రయపడే తల్లిగా సంగీత మంచి నటన కనబరిచింది. ఎమోషనల్ సీన్లలో అమ్మగా తన పర్ఫామెన్సుతో పాత్రకి బలాన్ని చేకూర్చింది. ఇక మసూదగా బాంధవి కూడా బాగా చేసింది. ఆత్మ ఆవహించనట్టు, మసూదగా తనని కట్టడి చేయడానికి ప్రయత్నించేవాళ్ల మీద కోపం చూయిస్తూ చాలా షేడ్స్ ఉన్న పాత్రని చక్కగా చేసింది. హీరోయిన్‌గా కావ్యకి కథాపరంగా పెద్ద ప్రాధాన్యత లేకపోయినా ఉన్న కొన్నిసీన్లలోనూ బానే నటించింది. పీర్ బాబాగా శుభలేక సుధాకర్ కూడా పాత్రకి తగిన న్యాయం చేసి నటనలో తన సీనియారిటీని మరోసారి నిరూపించుకున్నారు. సత్యం రాజేష్, సత్య ప్రకాష్, తదితరులు కూడా పాత్రమేర నటించారు.

కథనం, టెక్నికల్ ఎలిమెంట్స్
ఓటీటీలొచ్చాక వరల్డ్ సినిమా చేతిలోకొచ్చేసింది. చరిత్రలో నిలిచిపోయిన బెస్ట్ హారర్ సినిమాల నుంచీ లేటెస్టుగా విడుదలవుతోన్న హారర్, థ్రిల్లర్ సినిమాలు అన్నింటినీ చూసేసి ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు. దీంతో కొత్తగా హారర్ సినిమాని చూసి థియేటర్లో భయపడి, థ్రిల్ అవ్వాలంటే కచ్చితంగా సరికొత్తగా తీయగలగాలి. ఆ విషయంలో దర్శకుడిగా తన తొలి ప్రయత్నంతోనే మంచి మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ సాయి కిరణ్. పెద్దగా కొత్త కథేమీ కాకపోయినా కథనంతో ఒక్కో పాయింటుని ఆసక్తికరంగా రివీల్ చేస్తూ ప్రేక్షకుడికి చివరి వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా సీట్లలో కూచోబెట్టగలిగాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రొటీన్‌గా కాకుండా కొన్ని ఫ్రేమ్స్ కొత్తగా ప్రయత్నించారు. సౌండ్, బీజీఎం కూడా సీన్లలోని ఇంటెన్సిటీని పెంచేలా ఉన్నాయి. సాధారణంగానే హారర్ సినిమాల్లో ఈ రెండూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మసూదలోనూ కెమెరా, సౌండ్సుని బాగా వాడుకుని ఆడియెన్స్ ని ఆకట్టుకోగలిగారు. సెకండాఫ్ కాస్త స్లో అనిపించినా, క్లైమాక్సుకొచ్చేసరికి యండమూరి నవల తులసీదళంలోని కొన్ని సన్నివేశాలు కూడా గుర్తుకురాకమానవు.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే..
ఎన్ని ఓటీటీల్లో, ఫోన్లలో, ల్యాప్ టాపుల్లో చూసినా హర్రర్ సినిమా అంటే థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే ప్రేక్షకులు మసూదని చూసేయొచ్చు. కొన్నిసీన్లలో భయపడుతూ, అక్కడక్కడా కాస్త కామెడీ సీన్లకి నవ్వుతూ మొత్తంగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. పార్ట్ టూ కూడా ఉందంటూ ఆఖరులో హింట్ ఇచ్చేశారు కాబట్టి.. రెండో పార్టుకీ ప్రిపేరవొచ్చు.