ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీద్‌ను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను మథుర కోర్టు విచారణకు స్వీకరించింది. నెల క్రితం ఇదే అంశమై బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్టు సభ్యులైన రంజన అగ్నిహోత్రి, మరొక ఏడుగురు పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహి ఈద్గా ట్రస్టు మేనేజ్మెంట్ కమిటీలను ప్రతివాదులుగా చూపారు. ఆ పిటిషన్‌ను స్థానిక సివిల్ కోర్టు తిరస్కరించింది. దీంతో రంజన నేతృత్వంలోని ట్రస్ట్ సభ్యుల బృందం మరోసారి అప్పీల్ చేసింది.
దీనిపై విచారణ జరిపేందుకు జిల్లా జడ్జి సాధనా రాణి ఠాకూర్ శుక్రవారం అంగీకరించారు. తదుపరి విచారణ నవంబరు 18కి వాయిదా వేశారు. శ్రీకృష్ణ జన్మ భూమిలో కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో 17వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని 1968లో మధుర కోర్టు ఆమోదించింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.. ఈద్గా ట్రస్టు మేనేజ్మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్లో రంజన అగ్నిహోత్రి ఆరోపించారు. ఇదిలా ఉంటే మథురలోని ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొందరు బయటివారు ప్రయత్నిస్తున్నారన్నారని అఖిల భారతీయ తీర్థ్ పురోహిత్ మహాసభ అధ్యక్షుడు మహేశ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.