కృష్ణ జన్మభూమి వివాదం కీలక మలుపు తిరిగింది. శ్రీకృష్ణుడు పుట్టినట్లు భావిస్తున్న మథురలోని షాహీ ఈద్గా మసీదులో సర్వే చేయాలని స్థానిక సివిల్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2 తర్వాత అధ్యయనం పూర్తి చేసి 20 తేదీకల్లా తమకు నివేదిక సమర్పించాలని భారత పురాతత్వ సంస్థ(ఏఎస్ఐ)కు స్పష్టం చేసింది. హిందూసేన అనే సంస్థకు చెందిన విష్ణుగుప్తా వేసిన పిటిషన్ను విచారించి ఈమేరకు ఆదేశాలిచ్చింది. విజయం దిశగా ఇది తొలిమెట్టు అని హిందూసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 13 ఎకరాలున్న కత్రాకేశవ్ దేవ్ ఆలయంలో ఔరంగజేబు ఆదేశాలపై మసీదు కట్టారని, దాన్ని తొలగించి తిరిగి తమకు అప్పగించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. కృష్ణజన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గాల మధ్య 1968లో జరిగిన రాజీ చట్టవిరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రార్థనమందిరాల చట్టం 1991 ప్రకారం అలాంటి డిమాండ్ చెల్లదని మథుర సివిల్ కోర్టు ఇటీవల పిటిషన్లను కొట్టేసింది.