మేటింగ్ బ్యూరో.. బలిసిన వాళ్లకు మాత్రమే! - MicTv.in - Telugu News
mictv telugu

మేటింగ్ బ్యూరో.. బలిసిన వాళ్లకు మాత్రమే!

March 21, 2018

మనకు మ్యారేజ్ బ్యూరోలు తెలుసు. ఇదేంటి మేటింగ్ బ్యూరో అని ఆశ్చర్యపోతున్నారా? పూర్తిగా వింటే షాక్ తింటారు. అవును. మేటింగ్ బ్యూరోనే. ఆవులను, ఆంబోతులను.. మేకలను, మేకపోతును కలిపినట్లు కలపడమే దీని పని. అయితే కేవలం బాగా డబ్బుచేసిన వాళ్లకు వాళ్లమే. ఆస్తి అంతస్తులు ఉండి, ఏవో కారణాల వల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా, కేవలం పిల్లల్ని కనడానికే ‘ఆ సంబంధం’ కోసం వెతుక్కునే వాళ్లకు. సంతానం కోసం శారీరక కలయికను కుదుర్చిపెడుతుంది ఈ బ్యూరో. మనదేశంలో కాదని వేరే చెప్పాల్సిన పనిలేదు కదా. బ్రిటన్లో అన్నమాట.

ఈ మేటింగ్ బ్యూరో పేరు ‘స్టార్క్’. 2014లో మొదలైంది. పెళ్లికాని, వయసు పైబడుతున్న ధనవంతులు, రాజులు, సామంత రాజులు, రాణులు.. వగైరా బాపతువాళ్లు దీని క్లయింట్లు. వీరు ఆస్తుపాస్తులను తమ వేలువిడిచినవాళ్ల  కాలు విడిచినవాళ్లకు కాకుండా తమకు పుట్టే పిల్లలకే ఇచ్చుకోవడానికి, నడివయసులో సంతానం పొందండానికి మేటింగ్‌కు వీలుకల్పిస్తుందీ సంస్థ.

సభ్యత్వం 9 లక్షలు..

హోదాకు తగ్గట్టే ఈ సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 10 వేల పౌండ్లు(రూ. 9.17 లక్షలు) కట్టాలి. మేటింగ్ కోసం ఎదురు చూసే జంటలకు ఈ బ్యూరో ఇప్పటివరకు 14 కేసులను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి ఐదుగురు పిల్లలను పుట్టించింది. లూసీ కార్ట్2రైట్ వేల్స్ అనే 40 ఏళ్ల మహిళ ఇందులో ఒకరు. ఈమె చాలా సౌండ్ పార్టీ. ఫ్లైట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ కార్లు.. ఆ తరహా అన్నమాట. అయితే తనకు ఒక బిడ్డ ఉండాలని ఆశ. అయితే పెళ్లిపై ఇష్టం లేదు. అలాగని ఏదో ముక్కూమొఖమూ తెలియని దాత వీర్యంతో కృత్రిమ గర్భధారణ అసలిష్టం లేదు.

తన హోదాకు సరిపోని వాడితో సంబంధం కూడా ఇష్టం లేదు. తన స్థాయికి తగ్గటు, హైప్రొఫైల్ పురుషుడితో తాత్కాలిక శారీరక సంబంధం పెట్టుకుని, గర్భం తెచ్చేసుకుని ఓ బిడ్డను కనేయాలన్నదే కోరిక. స్టార్క్ ఆమె సమస్యను తీవ్రంగా పరిశీలించింది. అచ్చం ఆమె సమస్యతోనే అల్లాడుతున్న జేమ్స్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారిని సంప్రదించింది. ఇద్దరినీ కలిపేసింది. ఫలితంగా వేల్స్ ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జేమ్స్, వేల్స్ కలసి ఆ పిల్లాడిని పెంచుతున్నారు. త్వరలో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది ఆప్షనల్ మాత్రమేనని, మేటింగే తమ ధ్యేయమని సదరు స్టార్క్ చెబుతోంది. మేటింగ్ ద్వారా పిల్లలు పుట్టకపోతే కృత్రిమ గర్భధారణలో ప్రయత్నిస్తామని, అయితే అందులోనూ ‘అనుబంధానికే’ ప్రధాన్యమని చెబుతోంది. ఛీఛీ.. ఇదేంటి పశువుల్లాగా మేటింగేంటి అని విసుక్కోకండి. ఎవరి అవసరం వారిది. ఎవరి కమీషన్లు, ఫీజులు వారివి!