కోట్లు ఉన్నాయని జస్ట్ ఒక కోటి పిండుకుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

కోట్లు ఉన్నాయని జస్ట్ ఒక కోటి పిండుకుంది..

June 2, 2020

Matrimony website scam in hyderabad

ఆధునిక కల్యాణ వేదికలైన మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి  మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించి కోట్లు దండుకుంది. మాళవిక దేవతి అనే యువతి అనుపల్లవి మాగంటి పేరుతో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఓ నకిలీ ప్రొఫైల్ రూపొందించింది. అందులో తాను అమెరికాలోని మేరీల్యాండ్‌ బల్టీమోర్‌ ప్రాంతంలో జన్మించినట్లు, వృత్తిరీత్యా డాక్టర్‌ అని, తన తల్లిదండ్రులు కూడా డాక్టర్లేనని, తన ఇల్లు జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–71లో ఉందని వివరాలను పొందుపరిచింది. అలాగే వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. 

ఆమె ప్రొఫైల్ చూసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆమెతో చాటింగ్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆమె.. తన తండ్రి చనిపోయారని, ఆస్తులను తన పేరిట రాశారని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో వివాదం నెలకొందని, డబ్బున్న వ్యాపారవేత్త‌ కొడుకును పెళ్లి చేసుకోవాలని ఒత్తిళ్లు ఉన్నాయని చాటింగ్ లో తెలిపింది. తనకు మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని పేర్కొంది. తన పేరిట ఆస్తులు ఉన్నాయని. వాటిని న్యాయపరంగా దక్కించుకోవడానికి కొంత డబ్బు అవసరముందని, ఇందుకు సహాయం చేయాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఆమెకు విడతల్లో‌ కోటి రెండు లక్షలా 18 వేల 33 రూపాయలను యువతి ఇచ్చిన అకౌంట్‌లో జమ చేశాడు. తరువాత ఆమె చాటింగ్ చేయడం మానేసింది. దీంతో తాను ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసిన యువతి మాళవిక దేవతిగా గుర్తించడంతో పాటు తాను మోసపోయినట్లుగా భావించి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.