జయలలిత ఇల్లు ఇక ముఖ్యమంత్రి అడ్డాగా.. - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత ఇల్లు ఇక ముఖ్యమంత్రి అడ్డాగా..

July 16, 2020

May use Jayalalitha's house as CM residence

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని స్మారక చిహ్నంగా మార్చాలని గత మే నెలలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. పోయీస్ గార్డెన్ లో ‘వేదనిలయం’ పేరుతో ఉన్న ఆమె ఇంటిని ఆమె స్మారక చిహ్నంతో పాటు మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా జారీ చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మ్యూజియం పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వస్తువులు, సమాచారాన్ని ఇందులో ఉంచుతామన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోయెస్ గార్డెన్ కస్తూరి ఎస్టేట్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత ఇంటిని స్మారక చిహ్నంగా మారిస్తే ఈ ప్రాంతం రద్దీగా మారుతుందని, పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ప్రశాంతత దెబ్బతింటుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ట్రాఫిక్ అసెస్‌మెంట్ రిపోర్టుతో పాటు ఇతర నివాసితులతో సరైన సర్వే నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చడంపై ప్రజలకు కూడా ఆసక్తి లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

”ఇది కోట్ల మంది తమిళులకు పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అమెరికా సందర్శించినప్పుడు ప్రజలు వైట్‌హౌస్‌ను, లింకన్ ఇంటిని సందర్శిస్తారు. అలాగే, యూకేలో షేక్‌స్పియర్ ఇంటిని సందర్శిస్తారు. ఇది కూడా అలాగే మారుతుంది.” అని అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ చేసిన సబ్‌మిషన్‌లో పేర్కొన్నారు. పలువురు నాయకుల ఇళ్లను స్మారక చిహ్నంగా మార్చారని, ఇది అసాధారణమేమీ కాదని అడ్వకేట్ జనరల్ సబ్‌మిషన్‌పై స్పందిస్తూ జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇరు వర్గాలు చేసిన సబ్‌మిషన్‌ను రికార్డు చేస్తూ జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ పిటిషనర్ల అభ్యర్థనను కొట్టిపడేశారు. స్థానికులు ఇతర నివాసితుల శాంతియుత జీవనం ప్రభావితమయ్యేలా జనం గుంపులుగా గుమికూడతారన్న అసోసియేషన్ వాదనను అంగీకరించలేమని స్పష్టం చేశారు. దీంతో జయలలిత ఇంటిని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హైకోర్టుకు తెలియజేసింది.