పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా 'మయాంక్ అగర్వాల్‌' - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ‘మయాంక్ అగర్వాల్‌’

February 28, 2022

cricket

ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ కింగ్స్ తన తదుపరి కెప్టెన్‌గా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం తెలిపింది. ఈ నియామకానికి సంబంధించిన వివరాలను ఫ్రాంచైజీ ట్విటర్‌లో పేర్కొంది.

‘సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నా, అతనిని కాదని మయాంక్‌ను నూతన సారథిగా ఎంచుకున్నాం’ అని తెలిపింది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్ అగర్వాల్‌ను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకున్న సంగతి తెలిసిందే. మయాంక్ 2018 నుంచి పంజాబ్ కింగ్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, ఈసారి అతను జట్టుతో లేడు. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అంతేకాకుండా కేఎల్ రాహుల్ సారథిగా ఉన్నప్పుడు మయాంక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌లలో రాహుల్ గైర్హాజరీలో మయాంక్ జట్టుకు కెప్టెన్‌గాను పని చేశాడు. మయాంక్ గత సీజన్‌లో అద్భుతంగా ఆడాడు. 12 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 40.09గా ఉంది. అలాగే 140.28 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

మరోపక్క మయాంక్‌ను కెప్టెన్‌గా నియమించటంతో ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మయాంక్‌పై ప్రశంసలు కురిపించాడు. కుంబ్లే మాట్లాడుతూ, “మయాంక్ 2018 నుంచి జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. గత రెండేళ్లుగా జట్టు నాయకత్వ సమూహంలో భాగమయ్యాడు. మయాంక్‌తో కలిసి మేం భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నాము” అని తెలిపారు.