ఐపీఎల్ -2023 సమరానికి జట్లు సిద్ధమవుతున్నాయి. వేలం ముగియడంతో ఇప్పటి నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ నియామకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్‌ను వేలానికి ముందు రిలీజ్ చేయడంతో నూతన సారథిని ఎంపిక చేసే పనిలో పడింది. ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటందని తీవ్రంగా చర్చిస్తోంది. సోషల్ మీడియాలో కూడా హైదరాబాద్ కెప్టెన్సీపై ఊహాగానాలు మొదలయ్యాయి. మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్,అభిషేక్ శర్మలో ఒకరికి జట్టు పగ్గాలు అప్పగిస్తారని ఇది వరకు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో కొత్త పేరు యాడ్ అయ్యింది. ఇటీవల వేలంలో హైదరాబాద్ దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. కెప్టెన్సీ కోసమే మయాంక్‌ను హైదరాబాద్ రూ.8.25 కోట్ల భారీ ధరకు తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఉన్నా అతని వయసు, ఫిట్నెస్ సమస్యలు కారణంగా అతనిపై జట్టు యాజమాన్యం ఆసక్తి కనబర్చట్లేదని తెలుస్తోంది. విదేశి కెప్టెన్ ను నియమించే ఆలోచన లేకపోవడంతో మార్క్రమ్ కి కూడా అవకాశాలు కనిపించడం లేదు. ఇక అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ జరగగా..దానిలో ఎక్కువ మంది
మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అనుభవం ఉన్న నేపథ్యంలో అతనికే సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న జట్టు వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయం సాధించి..పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇందు కోసం జట్టును బలపర్చే విధంగా వేలంలో కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఏకంగా 13.25 కోట్లు పెట్టి హ్యారీ బ్రూక్ ను సొంతం చేసుకోగా..మయాంక్ కోసం 8.25 కోట్లు పెట్టింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ను రూ.5.25 కోట్లకు, ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను రూ.2 కోట్లకు దక్కించుకుంది. భారత్ యువ ఆటగాడు వివ్రాంత్ వర్మను రూ.2.6 కోట్లకు కైవసం చేసుకుంది. వీరితో పాటు దేశవాళిలో సత్తా చాటుతున్న యంగ్ ప్లేయర్స్ ను హైదరాబాద్ యాజమాన్యం టీంలోకి చేర్చుకుంది.
ఐపీఎల్ 2023 సన్ రైజర్స్ తుది జట్టు(అంచనా) :మయాంక్ అగర్వాల్, అభిషేక్ షర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, మార్క్రమ్,హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ మారకా జాన్సెన్.