పవన్ కళ్యాణ్ - మాయావతి పొత్తు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్ – మాయావతి పొత్తు

March 15, 2019

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల పొత్తులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో వెళ్లిన ఆయన.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు.

సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నామని ఇదివరకే పవన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఎస్పీతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ భేటీలో ఇరు నేతలు ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు. మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని ఉందని పవన్ వ్యాఖ్యానించగా.. పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూడాలని ఉందని మాయావతి వ్యాఖ్యానించడం విశేషం.