నన్ను ఎన్నుకోకపోతే దేశం విడిచిపోతా.. ట్రంప్ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను ఎన్నుకోకపోతే దేశం విడిచిపోతా.. ట్రంప్ హెచ్చరిక

October 17, 2020

Maybe I'll have to leave the country if Biden wins: Donald Trump

సంచలన వ్యాఖ్యలు చేయడంలో తనకు సాటి మరెవరూ లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. ఆయన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన సమయం నుంచి ఇప్పటివరకు ఎన్నో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చినన్ని మీమ్స్ మరెవరి మీద రాకపోవచ్చు. అయినా ఆయన ఐ డోంట్ కేర్ అంటారు. తాను  అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా సరే గద్దె దిగే ప్రసక్తే లేదని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండని ట్రంప్ ఇదివరకే  తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోమారు సంచలనంగా మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు తనను ఎన్నుకోకపోతే  ఈ దేశాన్ని వదిలిపెట్టి పోతానని హెచ్చరించారు. శుక్రవారం జార్జియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్  ప్రసంగించారు. రాజకీయ చరిత్రలో ఓ అధ్వాన్నపు అభ్యర్థి చేతిలో ఓడిపోవడం కన్నా దేశం విడిచి వెళ్లడమే బెటర్ అని జో బిడెన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది జోక్ కాదని, రాజకీయ చరిత్రలో పస, సామర్థ్యం లేని అభ్యర్థిపై తాను పోటీ చేయవలసి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పోటీ తనపై ఎంతో ఒత్తిడి తెస్తోందని వెల్లడించారు. 

తాను ఓటమి పాలైతే మీరే ఊహించండి.. తన జీవితమంతా ఏం చేయాలి ? అని ప్రశ్నించారు. ‘అయామ్ నాట్ గోయింగ్ టు ఫీల్ సో గుడ్.  ఐ మే లీవ్ దిస్ కంట్రీ’ అని ట్రంప్ తెలిపారు. నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ చరిష్మా తగ్గినట్టుగా కనిపిస్తోంది. డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌ వైపు పలు రాష్ట్రాల్లోని ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో బిడెన్ స్పీచ్ వినేందుకే చాలామంది హాజరయ్యారు. హాలంతా నిండిపోయింది. ట్రంప్  ర్యాలీకి  మాత్రం జనం అంతగా రాలేదు. కాగా, ఎన్నికల్లో పరాజయం పాలైతే శాంతియుతంగా పదవిని విజేతకు అప్పగించనని ఇదివరకే ట్రంప్ అన్నారు. ‘ఫలితాలు నాకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తాను. పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పారదర్శకత లేదు. ఆ ఓట్ల ఫలితాలను నేను అసలు  ఒప్పుకోను. అసలు ఈ విధానాన్నే తీసిపారేయాలి. అప్పుడే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అధికార మార్పిడి ఉండకుండా.. నా ప్రభుత్వమే ఉంటుంది’ అని ట్రంప్ చెప్పారు. కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్(మెయిల్ ఓటింగ్)కు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ట్రంప్ దానిని వ్యతిరేకిస్తున్నారు. ఓటమి భయంతోనే ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉందని విపక్షం అంటోంది.