తెలగు చిత్రసీమ పరిశ్రమ అల్లకల్లోలానికి గురౌతోంది. షూటింగులు చేద్దామంటే సినీ కార్మికులు లేక నిర్మాతలు, డైరెక్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ, బుధవారం మొదలైన సినీ కార్మికుల సమ్మె నేడు మరింత ముదిరింది. దీంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం షూటింగులు జరుపుకుంటున్న 28 సినిమాలు నిలిచిపోయాయి. గురువారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు మధ్య వివాదం మరింతా ముదరడంతో ఈ సమస్య సినీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరకు చేరింది.
సినీ కార్మికులంతా కలిసి బుధవారం సినీ కార్మికుల వేతానాలను పెంచాలని డిమాండ్ చేస్తూ, భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్‌ను ముట్టడించారు. దాంతో సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ”కార్మికుల వేతనాలు పెంచడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేటి నుంచి కార్మికులంతా యధావిధిగా షూటింగులకు హాజరవ్వాలి” అని వేడుకున్నారు. అయినా, సినీ కార్మీకులెవరూ ఈరోజు కూడా షూటింగులలో పాల్గొనలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న 28 సినిమాల షూటింగులు ఆగిపోయానని సమాచారం.
ఈ వివాదంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..” ఇరు పక్షాలకి చెప్తున్నా. దయచేసి పంతాలు, పట్టింపులకు వెళ్లకండి. రెండు వైపులా సమస్యలు ఉన్నాయి. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని నాతో చెప్పారు. ఈ విషయంపై ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతాం. సమస్యను పరిష్కరించుకుందాం. షూటింగ్స్‌పై రెండు పక్షాలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయి. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందాం” అని ఆయన అన్నారు.
మరోపక్క తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు మధ్య చర్చలు మొదలైయ్యాయి. ఈరోజు నుంచి యధావిధిగా షూటింగ్స్‌లో పాల్గొనాలని తెలుగు ఫిలిం ఛాంబర్ కోరినట్లు తెలుస్తోంది. వేతనాలు పెంచితే తప్ప, షూటింగులల్లో పాల్గొనమని కార్మికులు సమాధానం ఇవ్వగా.. అవసరమైతే అరు నెలల పాటు షూటింగులను నిలిపివేస్తామని నిర్మాతల మండలి హెచ్చరించింది. నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురికావొద్దు అని తెలుగు ఫిలిం ఛాంబర్‌ను కోరినట్లు సమాచారం. మరి ఈ సమస్యకు ఈరోజు అయిన పరిష్కారం దొరుకుతుందా?, ఆగిపోయిన సినిమా షూటింగులు యథావిధిగా జరుగుతాయా? లేదా అని మరికొన్ని గంటల్లో తెలనుంది.