హోర్డింగులకు డబ్బులున్నాయి కానీ, డాక్టర్లకు జీతాల్లేవు.. - MicTv.in - Telugu News
mictv telugu

హోర్డింగులకు డబ్బులున్నాయి కానీ, డాక్టర్లకు జీతాల్లేవు..

October 25, 2020

Hoarding

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మనుషులను పట్టుకుని పట్టి పీడిస్తున్న సమయంలో దేవుళ్లలా మారారు వైద్యులు. ఎందరికో కరోనా నుంచి విముక్తి కలిగించి పునర్జన్మ ప్రసాదించారు. రాత్రి, పగలు అనే తేడాలేకుండా రోజుకు 18 నుంచి 20 గంటల వరకు పనిచేస్తూ కరోనా బాధితులకు సేవలు చేస్తూ, తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు కూడా కరోనాకు బలయ్యారు. అయినా వారు వెనకడుగు వేయకుండా బాధితుల ప్రాణాలకు అండగా నిలిచారు. అలాంటి వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారికి ప్రతీ ఒక్క పౌరుడు సలాం చేయాల్సిందే. ఇంత చేస్తున్న తమకు జీతాలు ఇవ్వకపోవడంపై ఢిల్లీకి చెందిన డాక్టర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని డాక్టర్ల జీతాలపై హెల్త్ అండ్ అర్బన్ డవలప్‌మెంట్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ స్పందించారు. 

కరోనా రాక్షసి నుంచి ఈ దేశాన్ని రక్షిస్తున్నవారికి జీతాలు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. వైరస్ మొదలైనప్పటి నుంచి డాక్టర్లు రక్షణ కవచాల్లా దేశ ప్రజలను కాపాడుతున్నారని గుర్తుచేశారు. వారికి సరైన సమయానికి జీతాలు లేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్‌సీడీ) వద్ద హోర్డింగ్‌లు కట్టడానికి నిధులు ఉంటాయి కానీ, డాక్టర్ల జీతాలు ఇవ్వడానికి నిధులు ఉండవని మండిపడ్డారు. డాక్టర్లకు ఎమ్‌సీడీ జీతాలు ఇవ్వాలని, మరి ఆ డబ్బులను ఎక్కడ ఖర్చు చేస్తుందో అంతుచిక్కడం లేదని తెలిపారు. ఎమ్‌సీడీ సరిగా పనిచేయడం లేదని, ఆసుపత్రులను ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ బీజేపీకి లేఖ రాశానని పేర్కొన్నారు.