ప్రముఖ కంపెనీలలో లేఆఫ్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ 2,000 మంది ఉద్యోగులను ప్లాన్ ప్రకారం తొలగించేందుకు రెడీ అయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతోద్యోగులు తెలిపారు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో వచ్చే 2-3 వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
2012లో మెకిన్సీలో ఉద్యోగుల సంఖ్య 17,000. ఐదేళ్ల క్రితం నాటికి ఆ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు అది 45,000గా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, క్లయింట్లతో నేరుగా పనిచేసే నిపుణుల నియామక ప్రక్రియ మాత్రం ఆగబోదని కంపెనీలోని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2022 ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఫైనాన్స్ నుంచి టెక్నాలజీ, రిటైల్ వరకు అన్ని రంగాల్లోని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.