నెల్లూరు జిల్లాలో లేడీ కానిస్టేబుళ్లకు కొత్త యూనిఫాం కుట్టించే విషయంలో మగవాడితో కొలతలు తీయించిన పోలీసుల నిర్ణయంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఉమేశ్ చంద్ర హాలులో మహిళా కానిస్టేబుళ్లకు మగవాడితో కొలతలు తీయించారు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధంకాక ఇబ్బంది పడుతూ, కొలతలు ఇచ్చారు.
Video :
ఆ కొలతలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు, మహిళా సంఘాలు, నాయకులు ఫైర్ అవుతున్నారు. ‘మహిళలకు మగ టైలర్‌తో కొలతలు తీయించడం ఏంటీ?, మీ ఇంట్లోని ఆడవాళ్లకు కూడా ఇలానే కొలతలు తీయిస్తారా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించి, జిల్లా ఎస్పీ విజయరావుతో ఫోన్లో మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ ‘మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. మహిళా టైలర్లతోనే యూనిఫాం కొలతల ప్రక్రియ జరిగేలా చూస్తాం. అదనపు ఎస్పీ వెంకటరత్నంకు దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తాం’ అని చెప్పారు. అనంతరం ఈ ఘటనపై మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారని, సెల్ ఫోన్‌తో ఫొటోలు తీసిన వ్యక్తిని తాము గుర్తించామని వెల్లడించారు. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.