మెదక్ జిల్లాలో ఈ నెల 9న జరిగిన కారు దగ్ధం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు, సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్.. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా అసలైన నిజాలు వెల్లడించాడు. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఒప్పుకున్నాడు. ఇందుకు నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఉండే తన అక్క, ఆమె కుమారుడి సాయం తీసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడి పెద్ద ఎత్తున అప్పులు చేయడంతో వాటిని తీర్చే మార్గం లేక ఈ పని చేశాడు ధర్మానాయక్. చనిపోయిన వ్యక్తి బీహార్‌కి చెందినవాడు కాగా, హైదరాబాదులోని ఓ అడ్డాపై ఉన్న అతడిని రోజువారీ కూలీ ఇస్తానని చెప్పి తీసుకువచ్చాడు. తర్వాత పూటుగా మద్యం తాగించి గొడ్డలితో నరికి పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. అయితే చనిపోయింది తానేనని నమ్మించేందుకు అందుకు తగ్గ ఆధారాలను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఘటన జరిగిన తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కానీ హత్య తర్వాత పుణెకి పారిపోయిన ధర్మా.. తన డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలని భార్య నీలాకు మెసేజ్ చేయడంతో ధర్మా బతికే ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం సెల్ సిగ్నల్స్ ఆధారంగా పుణె వెళ్లి ధర్మాను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కాగా, ధర్మాకు రెగ్యులర్ డ్రైవర్ లేడని, కారు కూడా సెకండ్ హ్యాండ్ లో కొన్నదని తెలుస్తోంది.