మేడారం మహాజాతర..కొలువుదీరిన సారలమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

మేడారం మహాజాతర..కొలువుదీరిన సారలమ్మ

February 6, 2020

medaram000

వనం జనసంద్రమై మార్మోగింది. సారలమ్మ నామస్మరణతో భక్త జనం ఘోషించింది. డప్పు వాయిద్యాలు, భక్తుల హోరు మధ్య తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజుతో కలిసి సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య 4.5 కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి అమ్మవారిని ప్రతిష్టించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా  పట్టువస్త్రాలు సమర్పించారు. 

నిజానికి సారలమ్మ రాత్రి 9 గంటలకే చేరుకోవాల్సి ఉండగా.. భక్తుల కోలాహలం మధ్య 11.30 గంటలకు చేరుకోవాల్సి వచ్చింది. అమ్మవారి రాకకోసం ఎదురుచూసిన భక్తులు ఆమె చేరుకోగానే పూనకంతో ఊగిపోయారు. ఈ అపురూప దృశ్యాలను కళ్లారా తిలకించి దేవతను దర్శనం చేసుకున్నారు. కాగా గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క మేడారానికి రానుంది. ఆమె రాకకోసం భక్తులంతా కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవతామూర్తులు అంతా చేరుకోగానే శుక్రవారం అంతా కలిసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 8న రాత్రి గిరిజన దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్,గవర్నర్ తమిళిసై కూడా అమ్మవార్లను దర్శించుకోనున్నారు.