విషమంగా వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి.. 5 గంటలు గడిస్తే కానీ..
సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉండడంతో రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు. 5 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితి చెప్పలేమని తెలిపారు. దీంతో ప్రీతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
తన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ప్రీతి తండ్రి నరేంద్ర(ASI) తెలిపారు. ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్‌లో పీజీ కాలేజీలో జాయిన్ అయిన తన కూతుర్ని సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేస్తుండేవాడని, ఈ విషయం తమ కూతురు చెబితే ధైర్యం చెప్పామని తెలిపారు. స్థానికంగా అధికారులు, పోలీసులకు సమాచారం కూడా ఇచ్చామని, కానీ ఈ విషయం తెలిసి యూనివర్సిటీ అధికారులు పోలీసు కంప్లెంట్ ఎందుకు ఇచ్చారని వారు మందలించారని వాపోయారు. ర్యాగింగ్ను ప్రీతి వ్యతిరేకించిందని… తనకు మద్దతు పలకాలని తోటి విద్యార్థులను కోరగా రెండు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి కాబట్టి తమను కూడా వేధిస్తారని తోటి విద్యార్థులు వెనుకడుగు వేశారని ఆయన తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థిపై, అలాగే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆమె సోదరుడు పృథ్వి మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి తన చేతికి ఏదో ఇంజెక్షన్ తీసుకుందని… ఆమె గదిలో సిరంజి దొరికిందని స్వీపర్ అధికారులకు తెలిపిందని తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి ఏదో హానికారక ఇంజెక్షన్ను తీసుకున్నట్లు వైద్యులు భావిస్తున్నారన్నారు. అయితే ఆమె ఏ ఇంజెక్షన్ తీసుకుందో తెలుసుకునేందుకు రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. బీపీ, షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని.. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప డాక్టర్లు ఏం చెప్పలేమన్నారని పృధ్వి వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. సీపీతో మాట్లాడి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరో వైపు వరంగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.