వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ విద్యార్థి సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు బయటపడ్డాయి.రిపోర్ట్‌లో ప్రీతి-సైఫ్ మధ్య గొడవలు అంశాన్ని ప్రస్తావించారు. అదే విధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో సైఫ్ kmc పరిసరాల్లో లేడని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లోనూ సైఫ్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరకలేదు. ప్రీతి తండ్రి ఫిర్యాదుతో సైఫ్‌ను ప్రిన్సిపాల్, హెచ్ఓడీ మందలిచారు. ప్రీతితో గొడవలు వద్దని ప్రిన్సిపాల్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి ఇంజెక్షన్‌ను తీసుకున్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌లో పోలీసులు పొందుపర్చారు.
అయితే ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ప్రీతిది ఆత్మహత్య కాదని హత్యే అని ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. సైఫ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ప్రీతి తండ్రి నరేంద్ర ఆరోపిస్తున్నాడు. ప్రీతి కిందపడిపోయిన రోజు స్పాట్‌లోనే సైఫ్ ఉన్నాడని చెబుతున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ మాత్రం ప్రీతి పేరెంట్స్ ఆరోపణలకు దూరంగా ఉంది.
కాకతీయ వైద్యకళాశాలలో పీజీ చదువుతున్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.