రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో తాజాగా మరో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. సీనియర్ పి జి వైద్య విద్యార్థి సైఫ్ ప్రీతి ని ర్యాగింగ్ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు.. దాని వెనక ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ప్రీతిని వేధించలేదని చెబుతూ వస్తోన్న సైఫ్.. తాజాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నిందితుడు సైఫ్ నేరాన్ని అంగీకరించారని వరంగల్ పోలీసులు తెలిపారు. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు పోలీసుల విచారణలో సైఫ్ చెప్పినట్టు సమాచారం. తాను సీనియర్‌ని కనుక ప్రీతి వృత్తి రీత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ…అది ర్యాగింగ్ కాదని మొదట సైఫ్ వాదించాడు. ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్ చూపించి విచారించడంతో సైఫ్ నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నాలుగు రోజులు పాటు నిందితుడు సైఫ్ ను విచారించిన పోలీసులు మరో నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై నిన్న విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్ తిరస్కరించింది. దీంతో కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది.