వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రీతికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడని..తర్వాత దానిని ఆత్మహత్యగా కట్టుకథ అల్లాడంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందజేసినట్లు వెల్లడించారు. విచారణ పక్కాగా జరిగితే నిజాలు బయటకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం తొందరగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సైఫ్ వేధింపులపై తన వద్ద చాలా సార్లు ప్రీతి వాపోయిందని తెలిపారు. పోలీసులు ప్రీతిది మాత్రం ఆత్మహత్యాయత్నంగా చెబుతున్నారు. , గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రీతి మృతిలో స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ప్రీతి మృతదేహాన్ని
గిర్నీ తండాకు తీసుకొచ్చారు. అక్కడే కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రీతి మృతదేహాన్నిచూసి ప్రజలు బోరున విలపిస్తున్నారు. ప్రీతి అంత్యక్రియల్లో అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.