ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం. ప్రీతి ఆరోగ్యంపై ఆమె తండ్రి నరేంద్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఆరోగ్యం రానురాను క్షీణిస్తుందన్నారు. బతుకుతుందనే ఆశలు లేవని చెప్పారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోయిందని తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని ఆశించినప్పటికీ అలాంటి పరిస్థితి కనపించలేదన్నారు. ప్రీతి విషయంలో అద్భుతం జరగలేదని..ఆశ వదిలేసుకున్నామని తండ్రి నరేంద్ర వాపోయాడు. మరోవైపు ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉండడంతో నిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
నేడు(ఆదివారం) పలువురు నేతలు నిమ్స్ ఆస్పత్రికి వచ్చి ప్రీతి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ఇతర నాయకులు వేర్వేరు సమయాల్లో ఆస్పత్రికి వచ్చారు. నిమ్స్‌లో ప్రీతికి సరైన వైద్యం అందడం లేదంటూ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.