నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో విద్యాసాగర్ జూన్ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. అయితే విద్యాసాగర్ మరణానికి కారణం పావురాలు అంటూ ఇటీవల వార్తలు పెద్ద ఎత్తున సర్కులేట్ అయ్యాయి. పావురాల విసర్జితాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా మీనా రెస్పాండ్ అయ్యారు. ఇకపై ఇలాంటి వార్తలను సర్కులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్ చేశారు.
‘‘భర్త దూరమయ్యారనే బాధలో నేనున్నా. దయచేసి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. పరిస్థితి అర్థం చేసుకోండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలు ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు సహాయం చేసినవారు, మా కుటుంబానికి తోడుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందం, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, మా స్నేహితులు, మీడియాకు ధన్యవాదాలు. నా భర్త త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు. వారి ప్రేమకు ధన్యురాలుని’’ అని మీనా ఆ లేఖలో ఎమోషనల్గా రాశారు.