Meerpet: Woman Who Conspired To Kill Paramour Along With Two Others Arrested
mictv telugu

ప్రియుడితో మాజీ ప్రియుడి హత్య.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

May 13, 2022

వివాహేతర సంబంధాలు ఏవైనా చివరకు మనుషుల ప్రాణాలనే బలి కోరతాయి. కొన్ని రోజుల క్రితం అబ్ధుల్లాపూర్ మెట్ లో జరిగిన జంట హత్యల ఘటన మరువక ముందే తాజాగా మీర్‌పేట్‌లో ఓ వ్యక్తి హత్యకు కూడా అక్రమసంబంధమే కారణం. భర్తకు తెలియకుండా సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ గృహిణి.. మరో ప్రియుడి సహాయంతో అతణ్ని హత్య చేయించింది. ఈ హత్యకు సంబంధించిన సీసీ దృశ్యాలు బయటికొచ్చాయి.

పెళ్లి పేరుతో ప్రియుడు యశ్మ కుమార్ వేధిస్తుండటంతో శ్వేతారెడ్డి అనే వివాహిత ఈ హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో ప్రియుడు అశోక్ సాయం తీసుకుంది. యశ్మకుమార్‌ను శ్వేతారెడ్డి.. ప్రశాంతి హిల్స్‌కు ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 12గంటలకు పిలిపించింది. ముందస్తు కుట్ర ప్రకారం అశోక్, అతని స్నేహితుడు కార్తీక్ సమీపంలోనే మాటు వేశారు. బైక్‌పై శ్వేతారెడ్డి కోసం వెయిట్ చేస్తున్న యశ్మకుమార్‌ను సుత్తితో వెనక వైపు తలపై మూడు సార్లు అశోక్ కొట్టాడు. ఒక్కసారిగా యశ్మకుమార్ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత యశ్మకుమార్ ఫోన్ కోసం వెతికి అక్కడినుంచి పారిపోయాడు.

అటునుంచి వెళ్తున్న మిగతా వాహనదారులు యశ్మకుమార్ బైక్‌పై నుంచి కిందపడిపోయాడని భావించారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీ సాయంత్రం మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్మకుమార్ పడిపోయిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అసలు విషయం బయటపడడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు హత్యకు కారణమైన నిందితులు శ్వేతారెడ్డి, అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు శ్వేతారెడ్డి మనసు మార్చుకొని.. వాట్సాప్‌ ద్వారా అశోక్‌కు యశ్మకుమార్‌ను వదిలేయమంటూ మెసేజ్‌ పంపినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.