డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే.. సిజేరియన్ చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే.. సిజేరియన్ చేసి..

August 11, 2020

మనం ముందు ఓ పని చేసి వేరే వృత్తిలో స్థిరపడతాం. అయితే మనం అప్పుడు నేర్చుకున్న పని ఎక్కడికీ పోదు. అది మనతోనే ఉంటుంది. ఏదో సమయంలో అది మనకు గానీ, ఇతరులకు గానీ ఉపయోగపడుతుంది. అదే జరిగింది ఓ ఎమ్మెల్యే విషయంలో. 

సరైన సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయనే స్వయంగా ఓ గర్భిణీ మహిళకు సిజేరియన్ చేశారు. సిజేరియన్ సక్సెస్ అవడంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేను గర్భిణీ కుటుంబ సభ్యులు ఆపద్భాంధవుడు అని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సంఘటన మిజోరాం రాష్ట్రంలోని చాంఫాయిలో చోటు చేసుకుంది. 

ఇటీవల జిల్లాలో భూకంపం సంభవించింది. దీంతో బాధితులను పరామర్శించడానికి ఎమ్మెల్యే జీఆర్ థియామ్‌సంగా అక్కడికి వెళ్లి ప్రజలను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో ఓ 38 ఏళ్ల గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరని తెలుసుకున్న థియామ్‌సంగా.. తానే రంగంలోకి దిగారు. తనలోని వైద్యుడికి పనిచెప్పారు. అత్యవసర సిజేరియన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, సదరు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రాకమునుపు గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్‌గా వైద్య సేవలు అందించారు.