దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ మంత్రసాని - MicTv.in - Telugu News
mictv telugu

 దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ మంత్రసాని

October 25, 2019

Meet The First Transgender Woman To Become A Nurse

ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు అడుగడుగునా అవమానాలే కాదు అనేక విజయాలను సొంతం చేసుకుంటున్నారు.  తమపై ఉన్న అపోహలను తుడిచిపారేస్తున్నారు. ఇంటినుంచి, సమాజం నుంచి అనేక తిరస్కారాలు ఎదుర్కుని తమనితాము తీర్చిదిద్దుకుంటున్నారు. ఈక్రమంలో ట్రాన్స్‌జెండర్లు విద్యావంతులుగా రాణించి వివిధ రంగాల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మన దేశంలో ఇంకా ట్రాన్స్‌జెండర్లను ప్రభుత్వాలు గుర్తించడంలేదు. స్త్రీ, పురుషుడు కాలమ్ మాదిరే ట్రాన్స్‌జెండర్ కాలమ్ కూడా ఉండాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్‌జెండర్ చట్టంతో చేసిన ప్రయత్నం ఫలించింది. 

తమిళనాడుకు చెందిన రక్షిక రాజ్ అనే ట్రాన్స్‌జెండర్ దేశంలోనే గుర్తింపు పొందిన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ నర్సుగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ స్థాయిని పొందడానికి ఆమె ఓ పోరాటమే చేశారు. తమిళనాడులోని పద్మశ్రీ నర్సింగ్ కాలేజ్ నుంచి జులై, 2018లో ఆమె నర్సింగ్ పూర్తి చేశారు. అప్పట్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. అయితే తమిళనాడు నర్స్, మిడ్‌వైవ్స్ కౌన్సిల్(TNNMC)లో సభ్యత్వం కోసం వెళ్లినప్పుడు ఆమెకు అనుకోని సమస్య ఏర్పడింది. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాల్లో.. జెండర్ కేటగిరిలో ట్రాన్స్‌జెండర్‌ ఆప్షన్ లేకపోవడంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
నర్సింగ్ కాలేజ్‌లో చేరినప్పుడు ‘పురుషుడు’గానే రక్షిక అడ్మిషన్ తీసుకున్నారు.  ఈ క్రమంలో ఎలాగైనా తాను టీఎన్ఎన్ఎంసీలో నర్సు సభ్యత్వాన్ని ట్రాన్స్‌జెండర్ కేటగిరీలోనే తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తుచేసింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ కూడా పొందుపరచాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు టీఎన్ఎన్ఎంసీ ఎట్టకేలకు ఆమెకు ట్రాన్స్‌జెండర్‌ నర్సుగా సభ్యత్వం కల్పించింది. 

ఈ మేరకు శుక్రవారం తమిళనాడు నర్స్, మిడ్‌వైవ్స్ కౌన్సిల్(TNNMC) అధికారిక ధ్రువీకరణ పత్రాలను ఆమెకు అందజేసింది. ఎట్టకేలకు టీఎన్ఎన్ఎంసీ తనకు ట్రాన్స్‌జెండర్ నర్సుగా గుర్తింపునిచ్చిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆవిధంగా రక్షికా రాజ్ దేశ చరిత్రలోనే ట్రాన్స్‌జెండర్‌ నర్సుగా సభ్యత్వం పొందిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సాధించారు.  ట్రాన్స్‌జెండర్ నర్సుగా టీఎన్ఎన్ఎంసీ తనకు గుర్తింపును ఇవ్వకపోవడంతో ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నానని ఆమె వాపోయారు.