58 యేండ్ల వయసు రాకముందే ఎప్పుడెప్పుడు రిటైర్ అవుదామనే ఆలోచిస్తుంటారు. అలాంటిది 93యేండ్ల వయసులో కూడా ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదీ ప్రొఫెసరమ్మ. రిటైర్ అయ్యాక సుఖమైన జీవితంలో బతికేయాలని ముందుగానే ఏవేవో ప్లాన్స్ చేస్తుంటారు. కొందరు మనమలు, మనమరాండ్లతో కాలక్షేపం చేసేవాళ్లే ఎక్కువ ఉంటారు. కానీ చిలుకూరి శాంతమ్మ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించింది. కర్ర పట్టిన చేతితోనే పిల్లలకు పాఠాలు చెబుతూ ఇప్పటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది.
ఏడు దశాబ్దాలుగా..
చిలుకూరు శాంతమ్మ.. ఆంధ్రప్రదేశ్ లో 8 మార్చి 1929లో జన్మించారు. భౌతిక శాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. అదే సబ్జెక్ట్ ని బోధనగా ఎంచుకుంది. 1989లో.. 60యేండ్ల వయసులో పదవీ విరమణ చెందింది. అయితే పదవీ విరమణ చేసినప్పటికీ ఆమె ఉపాధ్యాయ వృత్తిని వదులుకోవాలనుకోలేదు. మరికొంతమందికి తన విద్యను అందించాలనుకుంది. ఏడు దశాబ్దాలుగా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నది. ఎంతోమంది యువకులకు భౌతిక శాస్త్రంలో ఉన్న అనుమానాలను తీరుస్తున్నది.
అనేక పోస్టుల్లో..
టీచింగ్ పై ఆమెకున్న అభిరుచి వల్ల ప్రతిరోజూ వైజాగ్ నుంచి విజయనగరం వరకు అంటే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి మరీ విద్యను బోధిస్తున్నది. ఆమె ఆంధ్రాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ బోధిస్తున్నారు. శాంతమ్మ తల్లి వనజాక్షమ్మ 104యేండ్ల వయసు వరకు జీవించారు. శాంతమ్మ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు. నిజానికి ప్రపంచలోనే అతి వయసు గల టీచర్ గా ఆమెను చెప్పుకోవచ్చు. ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో బీఎస్సీ, మైక్రోవేవ్ స్పెక్ర్టోస్కోపీలో డీఎస్సీ(పీహెచ్ డీకి సమానం) చేశారు. ఆమె కెరీర్ లో.. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు లెక్చరర్, ప్రొఫెసర్, రీడర్, పరిశోధకురాలిగా అనేక విభాగాల్లో పని చేశారు.
అవార్డులు కూడా..
శాంతమ్మ.. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ విశ్లేషణ మీద అనేక గౌరవాలు, అవార్డులను కూడా పొందారు. 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్ లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు. శాంతమ్మ కేవలం పాఠాలు చెబుతుందనుకుంటే పొరపాటు పడినట్లే. ఆమె రచయిత్రి కూడా. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై మంచి పట్టు ఉంది. ‘భగవద్గీత – ది డివైన్ డైరెక్టివ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు.