జగన్‌ను సన్మానించిన చిరంజీవి.. రాజకీయాలపై చర్చ! - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ను సన్మానించిన చిరంజీవి.. రాజకీయాలపై చర్చ!

October 14, 2019

ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అపాయింట్‌‌మెంట్ లభించింది. సోమవారం చిరంజీవి దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి వారిని సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. సమావేశం అనంతరం చిరంజీవి-సురేఖ దంపతులకు జగన్‌ విందు ఇవ్వనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవితో భేటి కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 11వ తేదీన జగన్‌తో చిరంజీవి భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. అనివార్య కారణాలతో వీరి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే.

Megastar Chiranjeevi.

ఈ భేటీలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాటు, రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉంది. తాను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. ఇదిలావుండగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సినీ ప్రముఖులు ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.