దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. విద్యుత్ వాహనాల వాడకానికి ఎక్కువ మంది వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు, బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై కంపెనీలు దృష్టిసారించాయి. రోజురోజుకి డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున వివిధ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ టిప్పర్ కూడా వచ్చేసింది. ఇది మన దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ టిప్పర్.దీనిని తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ తయారు చేయడం విశేషం.
మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థకు చెందిన వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈ ఎలక్ట్రిక్ టిప్పర్‌ను బెంగళూరులో ఆవిష్కరించింది. ఇండియా ఎనర్జీ వీక్–2023లో ఈ ట్రక్కును ప్రదర్శనకు ఉంచారు. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే ఈ టిప్పర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు గంటల్లోనే బ్యాటరీ వంద శాతం చార్జ్ అవుతుంది. 2022 నుంచి జరుగుతున్న ట్రయల్స్ విజయవంతం కావడంతో త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు.
Excited to share that our Olectra Electric Tipper has received a tremendous response at #IndiaEnergyWeek Bengaluru. #OlectraEletricTipper pic.twitter.com/RFRS3qT6i7
— Olectra Greentech Limited (@OlectraEbus) February 7, 2023