నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బహుముఖ పోటీ నెలకొంది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇరు రాష్ట్రాల సరిహద్దులను మూసివేశారు. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 2న రానున్నాయి.
మేఘాలయలో బహుముఖ పోటీలో నాలుగు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), తృణమూల్ కాంగ్రెస్ సహా మొత్తం 13 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మొత్తం 60 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలబెట్టగా, తృణమూల్ 56 మంది అభ్యర్థులను నిలబెట్టింది.
ముఖ్యమంత్రి కొన్రాడ్ కె. సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ 57 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో 32 మంది మహిళలు సహా 329 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సోహియోంగ్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగోర్ తెలిపారు. అందుకే ఈ స్థానానికి తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు.