10 కి.మీ. నడిచెళ్లి  కూరగాయలు తెచ్చుకునే ఐఏఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

10 కి.మీ. నడిచెళ్లి  కూరగాయలు తెచ్చుకునే ఐఏఎస్

September 25, 2019

Meghalaya IAS officer’s weekly 10km walk to market is so inspiring

ఓ హోదాలో వున్నవాళ్లు చేసే చిన్న చిన్న పనులైనా అవి చాలామంది పైన ప్రభావం చూపుతుంటాయి. అందుకే గొప్పవాళ్లు గొప్ప పనులు చేయాలంటారు. ఆయన ఓ ఐఏఎస్ ఆఫీసర్. అందుకని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఆర్డర్లు పాస్ చెయ్యరు. ఇంట్లో పనులు చక్కబెట్టడానికి పని మనుషులు కావాలని అనుకోరు. మన పని మనం చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యంగా వుంటుంది అని గట్టిగా నమ్మారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. మేఘాలయకు చెందిన రామ్‌సింగ్‌ అనే ఐఏఎస్‌ ఆఫీసర్ ప్రతివారం స్థానిక తూరా అనే ప్రదేశానికి 10 కి.మీ నడిచి వెళ్లి మరీ ఆర్గానిక్‌ కూరగాయలు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన వెస్ట్‌గారో హిల్స్ అనే ప్రాంతానికి డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

వారం రాగానే ఆయన నడిచి వెళ్లడాన్ని చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. ఎంచక్కా ఆయన నడుచుకుంటూ వెళ్ళి కావాల్సిన కూరగాయలు తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. వెంట ఓ వెదురుబుట్ట వుంటుంది. దానిని భుజానికి తగిలేసుకుని తన కాలినడక ప్రయాణం చేపడతారు. ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా వాడరు. ‘నో ట్రాఫిక్‌ జామ్‌, నో ప్లాస్టిక్‌, ఫిట్‌ మేఘాలయ, ఫిట్‌ ఇండియా, ఈట్ ఆర్గానిక్‌, తూరాను పరిశుభ్రంగా ఉంచాలి’ ఇవే ఆయన నమ్మిన సిద్ధాంతాలు. వాటికోసమే ఆయన నడకను ఎంచుకున్నారు. దీంతో ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని ఆయన గట్టిగా నమ్ముతారు. 

ఎప్పటిలాగే గతవారం కూడా ఆయన తన కుటుంబంతో పాటు మార్కెట్‌కి వెళ్లగా ఓ వ్యక్తి ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ ఫోటులు వైరల్ అయ్యాయి. ఐఏఎస్‌ అయి ఉండి ఎంత సాదాసీదా జీవనం సాగిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.