మమ్మల్ని బంగాదేశ్‌కు ఇచ్చేయిండి.. మేఘాలయ ప్రజల గోడు - MicTv.in - Telugu News
mictv telugu

మమ్మల్ని బంగాదేశ్‌కు ఇచ్చేయిండి.. మేఘాలయ ప్రజల గోడు

July 2, 2020

Meghalaya villagers ask govt to give them away to Bangladesh

‘సారూ.. మా కష్టాలను అటు ఢిల్లీ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు, ఇటు మా రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. ఇన్నేళ్ల నుంచీ ఓపిగ్గా ఎదురు చూశాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మా సమస్య తీర్చండి. లేకపోతే మమ్మల్ని కట్టగట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించండి..’.. అంటున్నారు మేఘాలయలోని నాలుగు గ్రామాల ప్రజలు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.

ఈ ఆవేదన వెనుక దశాబ్దాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మహానగరాల్లో యుద్ధప్రాతిపదికన రోడ్లు, వంతెనలు చకచకా కట్టేసే ప్రభుత్వాలు సరిహద్దులోని ఆ నాలుగు గిరిజన గ్రామాలకు రోడ్లను వెయ్యలేకపోయాయి. బంగ్లాదేశ్ సరిహద్దులోని ఈస్ట్ జంతియా హిల్స్ జిల్లాలో ఉన్నాయి ఈ గ్రామాలు. హింగారియా, హురి, లహలీన్, లెజ్రీ గ్రామాలకు సరైన దారి లేదు. వర్షకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాంబాయ్, బతా, భోర్ఖత్, సోనాపూర్ ప్రాంతాలను కలిపే రోడ్డు వేస్తే తమ సమస్యు పరిష్కరం అవుతాయని, కానీ ఏ నాయకులూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. 

Meghalaya villagers ask govt to give them away to Bangladesh

కేవలం రోడ్డు లేకపోవడమే కాదు, మరెన్నో సమస్యలు వీరిని వేధిస్తున్నాయి. మొబైల్ ఫోన్ల నెట్ వర్క్, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. 5 వేలకు పైగా జనాభా ఉన్న ఆ గ్రామాలు బంగ్లాదేశ్‌తో లావాదేవీలు జరుపుతూ బతుకీడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ల గోడు పట్టించుకుని రోడ్డు వేస్తుందని ఆశిద్దాం.