చేస్తున్న ఉద్యోగం ఊడుతుందనే భయం ఆ తల్లిదండ్రులను బిడ్డను చంపుకునే దాకా తీసుకెళ్లింది. తమకు పుట్టిన మూడో బిడ్డ, ఐదు నెలల పసికందును కాలువలో పడేసి నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీశారు. రాజస్థాన్లోని బికనీర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బికనీర్కి చెందిన జవార్ లాల్ మేఘ్వాల్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తున్నందును ఉద్యోగాన్ని రెగ్యులర్ చేస్తారనే ఆశతో ఉన్నాడు. ఇప్పటికే మేఘ్వార్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, ఇటీవలే మేఘ్వార్ భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే పేరెంట్స్ ప్రేమకు ప్రభుత్వ నిబంధన అడ్డు వచ్చింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఇద్దరిని మాత్రమే కనడానికి అవకాశముంది. అదనపు సంతానం కలిగితే ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. ప్రభుత్వం ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తుందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన మేఘ్వార్.. బిడ్డ కంటే ఉద్యోగం ముఖ్యమని నిశ్చయించుకున్నాడు. భార్యతో కలిసి చర్చించి మూడో బిడ్డను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం చత్తార్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలువలో పసికందును పడేసి వచ్చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి భార్యాభర్దలిద్దరినీ అరెస్ట్ చేశారు.