వీళ్ళను చూస్తే రెండు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది ! - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్ళను చూస్తే రెండు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది !

July 31, 2017

మానవత్వమా ఎక్కడున్నావ్ ?

ఏ మనిషిలో దాగున్నావ్ ?

నువ్వింకా బతికున్నావా ?

మనుషుల్లో బతకలేక జీవచ్ఛవమై

బతుకీడుస్తున్నావా ?

ఎక్కడా, నువ్వెక్కడ ?

నిన్ను బతికించుకోవడం ఎలా ?

చిటికెడు మంచితనాన్ని పంచండి

నేను బతికొస్తాను అంటావా ?

అలా చేస్తే మనిషి జన్మను సార్థకం చేస్తాను

ఇది నా హామీ.. అంటావా ????

ప్రస్తుత సమాజంలో మానవత్వం చచ్చిపోతోందనే చెప్పుకోవాలి. సాటి మనిషి కళ్ళ ముందు ప్రాణాలు పోతూ విలవిలాడుతున్నా పాపం అని కాసింత జాలి కురిపించనంత కఠినాత్ములుగా తయారౌతున్నారు జనాలు ? అలాంటి జనాలకు మేలుకొలుపు శంఖారావం ఊదుతున్నారు కడప జిల్లాకు చెందిన యువకులు. ‘ మేము సైతం ’ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దరిదాపు 50 మంది యువకుల వరకు మేముసైతం సమాజ సేవలో ఉంటున్నారు. మనిషిలో మానవత్వాన్ని మేల్కొలిపి సమాజంలోని ధీనత్వాన్ని, దానవత్వాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.

మేముసైతం

సమాజ సేవే ప్రధాన ఎజెండాగా వెలిసిందే ‘ మేము సైతం ’ సామాజిక సేవా సంస్థ. యాభై మంది యువకులు గ్రూపుగా ఏర్పడి ఈ సంస్థను కడప కేంద్రంగా 13 జనవరి 2017 నాడు స్థాపించి ఎన్నో సేవా కర్యక్రమాలు చేస్తూ సమాజం యొక్క రుణం తీర్చుకుంటున్నారు. ఈ సమాజం తనకేమిచ్చింది కాదిక్కడ తమ వంతుగా జమాజానికి మనమేమిస్తాం అన్న దిశగా ఆలోచించి, ఆ ఆలోచనలోంచి పుట్టినదే మేముసైతం. వీళ్ళు మామూలు మనుషులు కాదు మానవత్వం నిండిన మనుషులు. వీళ్ళను చూస్తే రెండు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సంస్థ నుండి సుమారుగా 50 అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆపదలో వున్న బతికున్న మనుషల్నే పట్టించుకోని దగాకోరుల సమాజంలో ఉన్నాం మనం. ఇంక చచ్చిపోయిన మనిషిని పట్టించుకునేదెవరు ? ఎహ మనకెందుకు పదా.. అంటూ దులుపుకొని చల్లగా జారిపోయే స్వార్థపరుల సందోహంలో వున్నాం. నాదీ – నాదీ అనుకుంటూ అవినీతిగా బతుకుతున్న మనుషుల ఈ అక్రమ సంఘంలో అధర్మంగా బతుకుతున్నాం ? మనుషులందరూ కలిసి మానవత్వాన్ని చంపేస్తున్నారని భావించి మానవత్వమే ఇలాంటి కొందరిని ఆవహించి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టే వుంది అదీ మేముసైతం అనే సంఘం ద్వార.

కార్తీక్, రాము, అయ్యవారయ్య, డాక్టర్ ఆనంద్, నాగముని, రవి, చంద్రమౌళి, గంగాధర్, మురళి, గురవయ్య, రెడ్డయ్య, రెడ్డి లక్మణ్, సురేష్, రాజేష్, శివ, ఉమా మహేశ్వర్, శివ కుమార్ గౌడ్, దినేష్…, ఇలా 50 మంది వరకున్నారు. డాక్టర్లు, పోలీసులు, మెడికల్ డిపార్టుమెంటుకు సంబంధించిన వారు, ఎన్నారైలు వున్నారు ఈ గ్రూపులో. ఈ సేవకు వాళ్ళకు ఎక్కడి నుండి ఎలాంటి ఫండ్స్ రావట్లేదు. ఎట్ లీస్ట్ ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకు ఎలాంటి గుర్తింపు లేదు. అయినా సేవ చెయ్యాలనే సంకల్పం చాలు అదే పెట్టుబడి అవుతుంది. వాళ్ళు తమ తమ పనులు చేస్కుంటూనే ఎవ్రీ సండే ఇలా సేవా పథంలో పాల్గొంటారు. తలా ఇన్ని డబ్బులు పోగు చేస్కొని సంఘసేవకు వినియోగిస్తున్నారు. వీళ్ళంతా గత పదేళ్ళుగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారే.

‘ ఎవరికైనా దానం చేస్తున్నామంటే ముఠ్టి మూచ్కే చెయ్యాలంటారు ’ వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎవరి నుండి మాకు గుర్తింపులు గట్రా అవసరం లేదు. ‘ మేము మా సంతృప్తి కోసం ప్రజా సేవ చేస్తున్నాం అంతే ’ అంటున్నారు చాలా సింపుల్ గా. ‘ నీదీ – నాదీ ’ అనే భావంతో చాలా మంది కన్నూ మిన్నూ మర్చిపోయి మంచితనాన్ని పాతరేసి, ‘మనీ’షిగా వ్యవహరిస్తున్నారు. మనం అనుకుంటే సమాజం మనదవుతుంది, సమాజం యొక్క కష్టం మనవదువుంతుంది కదా… అనే సిద్ధాంతాన్ని నమ్మి ముదుకు వెళుతున్నారు మేముసైతం టీం మెంబర్స్.
పుట్టినప్పుడు ఎలా పుట్టినా, చచ్చిపోయేటప్పుడు మాత్రం మన శవం దగ్గర ఓ నలుగురు వచ్చి ఏడిస్తే చాలనుకుంటారు చాలా మంది. అందుక్కూడా నోచుకోలేని వారి కోసం ఆ నలుగురిలా నడిచొచ్చి తమ భుజాన్ని పంచుతారు వీళ్ళు. వీళ్ళు అనాధలకు రక్తం పంచుకు పుట్టినవారి కన్నా ఎక్కువే. తల కొరివి పెడుతున్నారు గనక కడుపున పుట్టకపోయినా కన్న కొడుకులే వారికి !

 

ఈ సంస్థ ముఖ్యోద్దేశాలు

దిక్కులేని అనాధ శవాలకు సాంప్రదాయ బద్దంగా అంత్య క్రియలు చేయటం, భిక్షగాళ్ళకు హెల్తు చెకప్ చేసి వారికి మందులివ్వటం, వాళ్ళ జుట్టు పెరిగిపోయి హాలత్ ఖరాబుంటే నీట్ గా కటింగ్, షేవింగులు చేసి స్నానం చేయించి మంచి బట్టలు తొడుగుతుంటారు. అలాగే వూళ్ళల్లో, సిటీలో ఎలాంటి సమస్యున్నా ప్రభుత్వం కన్నా ముందే వీళ్ళు స్పందించి దాన్ని సాల్వ్ చెయ్యటం. సిసి రోడ్ల మరమ్మత్తులు, మురకి కాలువల ప్రక్షాళనలు, వీధి దీపాల పునరుధ్ధరణలు వంటివి ప్రభుత్వానికంటే ముందు వీరే స్పందించి సమస్యలను సావధానపరుస్తుంటారు. వేసవి కాలంలో చలివేంద్రాల ద్వారా మంచి నీటి సరఫరా, మజ్జిగ వంటివి పబ్లిక్కు అందించి దాహం తీరుస్తారు.

అలాగే మెడికల్ క్యాంపులు ద్వారా పల్లెటూళ్ళకు తిరిగి అక్కడ పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. అనాధాశ్రమాల అవసరాలు తెలుసుకొని ఆయా అవసరాలను తీర్చటం, పేదోళ్ళకు ఉచితంగా వైకుంఠ వాహనం పంపడం, అలాగే శీతల శవ పేఠికను కూడా ఫ్రీగా అందిస్తారు. ప్రతీ ఆదివారం పేదలకు కడుపు నిండా బువ్వ పెడతారు. గరీబోళ్ళు తమ దగ్గర పైకం లేక వచ్చిన రోగాలను నయం చేస్కోలేక అలా ప్రాణాలు వదులుకుంటున్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు మేముసైతం నిర్వాహకులు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సమాజానికి చేస్తున్న సేవలు అనన్య సామాన్యం ! కడపలో మేముసైతం ద్వారా మానవత్వ పరిమళాలు వికసిస్తున్నట్టే అనిపిస్తుంది.

అనాధ శవాలకు మేమున్నాం

కన్న కొడుకులు కానకుండా వెలేసిన పెద్దవాళ్ళు దుర్భరంగా రోడ్ల మీదకు భిక్షగాళ్ళ అవతారమెత్తి దేహీ అని అడుక్కుంటూ దుర్భరంగా బతుకులీడుస్తున్నారు. చివరికి దిక్కులేని చావు చస్తున్నారు. అలాంటి అనాధ శవాలెన్నో గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో వున్నాయి ? తమకు సంబంధించనవారెవరో వస్తారని ఆ శవాలు ఎదురు చూస్తుంటాయి ? కానీ ఎక్కడా ఎవరూ రారు ?? బతికున్న మనుషుల్నే పట్టించుకోలేని దౌర్భాగ్య వ్యవస్థలో బిక్కు బిక్కుమని మగ్గుతున్నాం. ఇంక శవాలను పట్టించుకుంటారా ??? కానీ మేము సైతం పట్టించుకుంటుంది. ఆ శవాలకు ఆఖరి నీళ్ళు పోసి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తుంది.

వయసులో వుండగా కాలు చేయి బాగున్నంత కాలం అంతా బాగానే వుంటుంది. చేతకాని వయసొచ్చాక కడుపున పుట్టినవారు కానుతారా లేదా ? అప్పుడు సంపాదించుకున్న చిల్లి గవ్వా చేతిలో లేక రిక్త హస్తాలతో రోడ్డున పడుతున్న పెద్దవాళ్ళు పాపం నగరాల్లో, వూళ్ళలో ధీనంగా చేతులు చాచి అడుక్కుంటుంటారు. ఇదీ మన పెద్ద తరానికి చిన్న తరం ఇస్తున్న గొప్ప కానుక ! ఇప్పటివరకు మేము సైతం వారు 50 అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. దీన్నిబట్టి మన దేశం, రాష్ట్రం ఎంత లోతులోకి కూరుకుపోతోందో అర్థం చేస్కోవచ్చు ??

మేముసైతంకు సలాం !

ఒక ముస్లిం ఫ్యామిలీలో భార్యకు క్యాన్సర్, భర్తకు పక్షవాతం, బిడ్డకు మాటలు రావు. వాళ్ళను పట్టించుకునే నాథుడు లేడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న మేముసైతం వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళ కష్టాన్ని విని, వెంటనే వారికి అవసరమయ్యే పైకం సమకూర్చటానికి ఒక ఈవెంటును ఆర్గనైజ్ చేసారు. దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆమె వైద్యానికి వెచ్చించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. పాపను బధిరులు స్కూల్లో జాయిన్ చేయించి తన మంచి చెడ్డలు చూస్కుంటున్నారు. అర్థం కాని జబ్బులతో సతమతమౌతున్న పేద ప్రజలకు మేముసైతం అండగా నిలబడి వైద్యానికయ్యే ఖర్చు కోసం ఈవెంట్లు ద్వారా డబ్బులు సమకూర్చి ఎందరికో బాసటగా నిలుస్తున్న మేముసైతంకు సలాం చేస్తున్నారు చాలా మంది.

– సంఘీర్