Mens are afraiding of marriage
mictv telugu

పెళ్లంటే భయపడుతున్న మగవాళ్లు.. అందుకు ఆరు కారణాలు

September 7, 2022

పెళ్లంటే ఏ అబ్బాయి అయినా ఎగిరి గంతేస్తాడు. ఆ ఫంక్షన్, హడావుడి, కొత్త భార్య వస్తున్న ఆనందం, బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు, కొత్త బంధాలు అంటూ మురిసిపోతాడు. ఇప్పటివరకు మనకు ఇంతవరకు తెలుసు. కానీ, సమాజంలో మెల్లగా ఓ మార్పు వస్తోంది. ఈ తరం అబ్బాయిలు పెళ్లంటే భయపడుతున్నారు. సమాజ విశ్లేషకులు ఇందుకు ఆరు కారణాలను చెప్తున్నారు. అవి

1. పెళ్లికి ఒత్తిడి తక్కువ
అమ్మాయిలకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని లేదా చేసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు. ఉన్నంతలో మంచి సంబంధం చూసి అత్తారింటికి పంపించేస్తారు. అదే అబ్బాయిల విషయంలో ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సమాజంలో ఎవరైనా పెళ్లి చేసుకోమని అబ్బాయిలను అడిగితే వారంత సీరియస్‌గా తీసుకోరు. అప్పుడు, ఇప్పుడు, చూద్దాంలే అని తప్పించుకుంటారు. ఈ కారణంగా వారిపై మానసిక ఒత్తిడి అనేది అమ్మాయిలతో పోలిస్తే అంతగా ఉండదు.

2. ప్రపోజల్ టెన్షన్
ప్రేమ వరకు సరదాగా యాక్సెప్టెడ్‌గా ఉండే అబ్బాయిలు పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడిగితే ఒప్పుకుంటుందా? లేదా? ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒప్పుకుంటే హ్యాపీయే కానీ ఒప్పుకోకుంటే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వారిని వెనక్కి లాగుతాయి. అందుకే చాలా ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళ్లట్లేదు. ముఖ్యంగా సిటీ కల్చర్ అలవాటు ఉన్నవారు, ఉన్నత వర్గం వారికి ఈ పరిస్థితి ఎదురవుతుంది.

3. భార్య పెత్తనం

ఈ మధ్య ఇది ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకు ముందు ఈ పరిస్థితి కొద్ది ఇళ్లల్లో ఉన్నా వాటిని సమాజం కూడా చాలా సరదాగా చూసేది. కానీ, రానురాను వ్యక్తుల ఇండిపెండెన్స్ పెరిగిపోతోంది. దాంతో పెళ్లయితే భార్యలు తమను కంట్రోల్ చేస్తారని, కండీషన్లు పెడుతూ, ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటుందని భావిస్తున్నారు. అదే ఏ గర్ల్ ఫ్రెండో అయితే ఈ విషయంలో ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారు. పెళ్లిని వాయిదా వేయడానికి ఇదీ ఓ కారణమని చెప్తున్నారు.

4. బరువు బాధ్యతలు, త్యాగాలు
పెళ్లయితే అప్పటివరకు ఉన్న స్వేచ్ఛా జీవితం ఉండదని అబ్బాయిల ఫీలింగ్. పెళ్లి చేసుకుంటే చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుందని, కొత్త బరువు బాధ్యతలు నెత్తిమీద పడతాయని ఆలోచిస్తున్నారు. ఓ చట్రంలో ఇరుక్కుపోయామన్న ఫీలింగ్ వెంటాడుతుందని దాంతో జీవితం ఆనందంగా గడపలేమని ఆందోళన చెందుతున్నారు.

5. విడాకులు
సహజంగా చూస్తే ఈ విడాకుల సంస్కృతి మన సమాజంలో లేదు. ఈ అంశం కొత్తగా వచ్చింది. ఈ మధ్య ఈ విడాకుల కేసులు కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో సరైన వ్యక్తిని పెళ్లాడకపోతే విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి వస్తుందని అనుకుంటున్నారు. ముందు జీవిత భాగస్వామితో అవగాహన కుదిరినా కొన్నేళ్లకు వారి క్యారెక్టర్లు మారిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా అవసరమా? అంటూ పెళ్లికి దూరంగా ఉంటున్నారు.

 

6. అక్రమ సంబంధాలు

ఈ మధ్య ఈ అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఊరు, నగరం, పట్టణం చూసినా ఇలాంటి వ్యవహారాల వల్ల దెబ్బతిన్న సంసారాలు చాలా ఉంటాయి. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంతేకాక, హత్యల వరకు వెళ్లిన సంఘటనలు చాలా ఉన్నాయి. వీటి గురించి సమాచారం టీవీలు, పేపర్లలో తరచూ వచ్చే వార్తలు చూసి అబ్బాయిలు విసుగు చెందుతున్నారు. అమాయక భర్తలు బలవుతున్న సంఘటనలు చూసి, విని పెళ్ళంటే జంకుతున్నారు. పెళ్లి చేసుకునే అమ్మాయికి అంతకు ముందే ప్రేమ వ్యవహారం ఉంటే అదో పెద్ద తలనొప్పి అనుకుంటున్నారు.

దీనికంటే నచ్చిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం లేదా సహజీవనం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పెళ్లి వల్ల నష్టాలేనా? లాభాలు లేవా? అంటే అది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అధ్యయనం ప్రకారం పెళ్లయిన మగవారు బ్యాచిలర్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది. కుటుంబాన్ని పోషించాలనే నైతిక బాధ్యత వల్ల కష్టం అనిపించినా బరువు బాధ్యతలు ఆనందంగా మోస్తున్న వారు సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తారు. ఇలాంటి వారే ఎక్కువ సంతోషంగా, ఎక్కువ కాలం బతుకుతున్నారు. అటు సమాజంలో గౌరవం కూడా పెళ్లయి కుటుంబం ఉన్న వారికే ఎక్కువగా దక్కుతుంది. ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో, శుభకార్యాలకు పిలిచే సందర్భంలో వివాహితులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వీటికి తోడు పెళ్లయి భార్య, పిల్లలు ఉంటే తమ వారసత్వం, వృద్ధాప్యంలో తోడు ఉంటాయనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉందని వెల్లడిస్తున్నారు.