డాక్టర్ సీట్లో పిచ్చోడు.. రోగులకు ప్రిస్క్రిప్షన్లు గీకి పడేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్ సీట్లో పిచ్చోడు.. రోగులకు ప్రిస్క్రిప్షన్లు గీకి పడేశాడు..

February 21, 2020

cvgnvgbn

మన దేశంలో మాత్రమే జరిగే వింతలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే చోద్యాలకు లెక్కలేదు. కుక్కలు, పందులు యథేచ్ఛగా తిరగడం దగ్గర్నుంచి తారుమారు ఆపరేషన్లు, కడుపులో కత్తెరలు అనేకం చోటుచేసుకుంటాయి. అవి చాలదన్నట్లు మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ జిల్లాలో మరింత విచిత్రం జరిగింది. 

సోమవారం జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ హిమాంశు భటన్ గదిలోని డాక్టర్ సీటు కాసేపు ఖాళీగా కనిపించింది. తర్వాత నిండుగా కనిపించింది. డాక్టర్ లేని సమయంలో మతిస్థిమితం లేని ఓ ముసలాయన లోపలికి దూరి డాక్టర్‌గా పోజు కొట్టాడు. అసలే ప్రభుత్వాస్పత్రి. ఎవరు డాక్టరో, ఎవరు కాంపౌండరో తెలీని జనం అతని ముందు కూర్చుని రోగాల గురించి వెళ్లబోసుకున్నాడు. అతడు కూడా అద్భుతంగా నటిస్తూ వివరాలు కనుక్కుని ప్రిస్క్రిప్షన్లు రాసి పడేశాడు. రోగులు తర్వాత ఫార్మాసిస్టు వద్దకు వెళ్లారు. అందులోని రోగాలేంటో, ఆ మందులేంటో అర్థం కాక ఫార్మాసిస్టు అనూప్ శుక్లా జట్టుపీక్కున్నాడు. ఏదో తేడా జరిగిందని అర్థమైంది. ఏ డాక్టర్, ఎక్కడ ఉన్నాడు అని రోగులను అడిగి నేరుగా డాక్టరు గదిలోకి వెళ్లాడు. అంతే.. కళ్లు బైర్లు కమ్మేశాయి. డాక్టర్ బదులు ఎవరో తేడా మనిషి కనిపించడంతో అతణ్ని పట్టేసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా వచ్చేశారు. దర్యాప్తు మొదలైంది. డాక్టర్‌గా పోజిచ్చిన మనిషి పిచ్చోడని, మానసిక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడని నిర్ధారించుకున్నారు. అయితే తాను ఎయిమ్స్ డాక్టర్‌నని, రోగులకు సేవ చేయడానికే వచ్చానని అతడు చెప్పుకొచ్చాడు. ఆ పని తర్వాత చేద్దువుగాని, ముందు ఇక్కడినుంచి పోదాం పదా అని వార్డుకు తీసుకెళ్లారు..  20 మందికి రోగులు అతని బారినపడినట్లు తెలుస్తోంది.