అసెంబ్లీ ముందు తల్లి మెడపై కత్తి పెట్టి..  అవినీతి అంటూ..  - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ముందు తల్లి మెడపై కత్తి పెట్టి..  అవినీతి అంటూ.. 

October 1, 2020

ఒడిశా రాజధానిలో ఓ సైకో చేష్టలకు పోలీసులు వణికిపోయారు. అసెంబ్లీ ముందు సొంత తల్లి మెడపై కత్తిపెట్టిన సైకో పిచ్చిపిచ్చిగా వాగాడు. ‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. కేబినెట్లో అవినీతి మంత్రులు ఉన్నారు. పూరి జగన్నాథ ఆలయ సంపదను కాజేశారు. వారిని శిక్షించకపోతే మా అమ్మను చంపేస్తా.. సీఎం నవీన్ పట్నాయక్ చాలా మంచోడు. మంత్రులే దొంగలు.. గవర్నర్ గారూ నా మాట వినండి. నాకు పిచ్చి లేదు ’ అంటూ హల్‌చల్ చేశాడు. అడ్డుకోబోయిన వారికి కత్తి చూపించి హుంకరించాడు. పోలీసులు అతణ్ని మాటల్లో పెట్టి కత్తి దింపించి తల్లి ప్రాణం కాపాడారు.  

నయాగఢ్ జిల్లా దసపల్లికి చెందిన అతడికి మానసిక స్థితి సరిగ్గా లేదు. తల్లి అతణ్ని డాక్టర్లకు చూపించేడానికి భువనేశ్వర్‌కు తీసుకొచ్చింది. ఆటో అసెంబ్లీ భవన్‌ వద్దకు రాగానే అతడు వీరంగం చేశాడు. సంచిలోంచి కత్తి తీసి తల్లి నేలపైకి తోశాడు. ఆమెను చంపుతానని కేకలు వేశాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని సముదాయించి కత్తి లాక్కున్నారు. అతన్ని కటక్‌లోని ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు.