అవతార్ కారు వచ్చేసింది.. కదలకుండానే పక్కకు తిరుగుద్ది - MicTv.in - Telugu News
mictv telugu

అవతార్ కారు వచ్చేసింది.. కదలకుండానే పక్కకు తిరుగుద్ది

January 7, 2020

hnnbn

అవతార్‌ సినిమానే కాదు ఆ కాన్సెప్ట్‌తో ఇప్పుడు ఓ కారు వచ్చేసింది. ఈ డైమ్లర్‌–బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారును లాస్‌ వెగాస్‌లో సోమవారం ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. ‘విజన్‌ అవతార్‌’గా పిలిచే ఈ కారు పూర్తి పక్కకు తిరగడంతో పాటు డ్రైవర్‌ స్పర్శకు కూడా స్పందిస్తుంది. ఇందులో కొత్త రకమైన ఆర్గానిక్‌ బ్యాటరీ,  30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులు ఉన్నాయి. ఈ కారుకు నడిపేందుకు చక్రం లేకపోవడం మరో విశేషం. దీని సెంట్రల్‌ కంట్రోల్‌ యూనిట్‌ను చేతితో పట్టుకుని తోలవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్‌ కంప్యూటర్‌ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్‌ ఇస్తూ కారును నడపవచ్చు. ఈ కారు మనిషిలాగా శ్వాస తీసుకున్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం వెనక భాగాన చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్‌ చేసి ఉంటుంది. 

ఈ కారు ఆవిష్కరణకు అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ రావడం విశేషంగా మారింది. ‘విజన్‌ అవతార్‌’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన విచ్చేసి కారు విశిష్ఠతను తెలుసుకున్నారు. ఇది ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగగలదు. పూర్తి ఎలక్ట్రిక్‌ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కలిగిఉంది. ఈ కారు గురించి దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కారులో తాను కూర్చొని చూశానని.. దీనికి నిజంగా ప్రాణం ఉంది, శ్వాస తీసుకుంటోందని తెలిపారు. ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్‌ బెంజ్‌ యాజమాన్యం తెలుపలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్‌ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్‌ వ్యాఖ్యానించారు.