Merry Christmas 2022: History, importance and significance of Christmas festival
mictv telugu

క్రిస్మస్‌ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

December 25, 2022

Merry Christmas 2022: History, importance and significance of Christmas festival

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసు క్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా ఈ పండుగ వేళ చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. లోకనాయకుడు జన్మించాడని కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెబుతారు.

రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు’ అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి’ మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు.’ అని చెప్పాడు.

తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లేహేమ్‌కు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు. జీసస్ పుట్టినప్పటి నుండి కరుణామయుడిగా.. దయామయుడిగా క్రైస్తవులందరి ఆరాధానలను అందుకుంటున్నాడు.

ఈ పండుగ వేళ ఆప్తులకు బహుమతులు ఇవ్వడం, ఎడ్వంట్‌ క్యాలెండర్‌ ఆవిష్కరించడం, కొవ్వొత్తులు వెలిగించడం, క్రిస్మస్‌ సంగీతం, గీతాలాపన, క్రీస్తు జననం ప్రదర్శన, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్‌ చెట్టు వంటివాటితో కూడిన అలంకరణలు ఉంటాయి. క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ప్రపంచానికి ప్రేమ, దయ,కరుణ లను పంచడమే ఆ ఏసు సందేశమని చెబుతుంటారు.