దళితుడి నోట్లోని ఆహారాన్ని తిన్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడి నోట్లోని ఆహారాన్ని తిన్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

May 23, 2022

దళితుడి నోటిలో ఆహారాన్ని తిని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.. ముందు దళితుడికి ఆహారం తినిపించిన ఆయన.. తిరిగి తనకు ఆ వ్యక్తి తినిపించబోతుండగా వద్దని వారించారు. దళిత వ్యక్తి నోట్లోని ముద్దనే తనకు తినిపించాలని కోరారు. అతడు కాస్త నమిలిన ఆహారాన్ని నోటి నుంచి తీయించి ఎమ్మెల్యే తినడం అక్కడున్న స్థానికులను షాక్‌కు గురిచేసింది. బెంగళూరులో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా ఆయన చేసిన పనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

పాదరాయణపూర్‌లోని అల్‌ అజర్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి, ఈద్‌ మిలాద్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వేదికపైనే చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్ ఖాన్ దళిత వ్యక్తికి అన్నం తినిపించారు. తిరిగి అన్నం తినిపించబోతుండగా.. చేతిలో ఉన్న అన్నం ముద్ద వ‌ద్ద‌ని, నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని ఆ దళితుణ్ని ఎమ్మెల్యే కోరారు. ఆయన చెప్పినట్టుగానే స్వామి నారాయణ తన నోట్లో ఉన్న ముద్దను తీసి తినిపించారు. దీంతో అక్క‌డున్న వారంతా చ‌ప్ప‌ట్లు కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ‘మనమంతా ఒకే జాతి. మనిషిగా జీవించడమే నిజమైన మతం. మానవ సంబంధాలకు కులం, మతం ఎప్పుడూ అడ్డుకావు. మనమందరం అన్నదమ్ముల్లా జీవించాలి’ అని ఎమ్మెల్యే అన్నారు.