ఆర్ధిక మాంద్యం దెబ్బ మెటాను భారీగానే కొట్టింది. దీనివల్ల మెటాకు వచ్చే అడ్వర్టైజ్ మెంట్ ఆదాయం పెద్ద మొత్తంలో గండిపడింది. దీంతో లక్ష్యాలను చేరుకోలేక నానా అవస్థలు పడుతోంది ఆ సంస్థ. అందులో బాగంగా మళ్ళీ ఉద్యోగులను తొలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఫేస్ బుక్, ఇన్స్టాల మాతృ సంస్థ మెటా మళ్ళీ లే ఆఫ్ లను చేపట్టనుందా అంటే అవుననే సంకేతాలే అందుతున్నాయి. అది కూడా వచ్చే వారంలోనే జరగొచ్చని చెబుతున్నారు. లాస్ట్ నవంబర్ లో 11 వేల మంది ఉద్యోగులను తొలిగించిన మెటా ఇప్పుడు కూడా భారీగానే లే ఆఫ్ లు చేయనుందని అంటున్నారు. దీని వల్ల వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఇంటిబాట పట్టక తప్పదని సమాచారం. మెటాకు అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఒకపక్క ఆర్ధిక మాంద్యం దాడిని తట్టుకోలేక చతికిలపడుతున్నా వర్చువల్ రియాలిటీ అయిన మెటావర్స్ మీద మాత్రం మెటా భారీగానే ఖర్చు పెడుతోంది. దీనికి సంబంధించిన రీసెర్చ్, అభివృద్ధి మీద బోలెడంత డబ్బును వినియోగిస్తోంది. కానీ దీని నుంచి ఆదాయం రావడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది అని చెబుతోంది మెటా. అందుకే ఇప్పుడు ఖర్చులను తగ్గించుకుంటున్నామని అంటోంది.